చైనా స్కూలులో నోరో వైరస్ కలకలం.. వంద మందికి పైగా సోకిన వైరస్

  • గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని స్కూలులో 103 మంది విద్యార్థులకు నోరో వైరస్
  • అప్రమత్తమైన అధికారులు.. స్కూలు చుట్టుపక్కల వైద్య పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడి
  • స్కూలు మొత్తం వైరస్ ను నాశనం చేసే మందులు స్ప్రే చేసిన అధికారులు
చైనాలోని ఓ స్కూలులో వైరస్ కలకలం రేగింది. వంద మందికి పైగా విద్యార్థులు అనారోగ్యానికి గురికావడంతో వైద్యాధికారులు రంగంలోకి దిగి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 103 మంది విద్యార్థులకు ‘నోరా వైరస్’ సోకినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. క్లాస్ రూమ్ లతో పాటు స్కూలు ఆవరణలో వైరస్ ను నాశనం చేసే మందును చల్లారు. వైరస్ బాధిత విద్యార్థులకు చికిత్స అందజేస్తూనే మిగతా విద్యార్థులకు వైరస్ సోకకుండా చర్యలు చేపట్టారు.

బాధిత విద్యార్థులు అందరూ కోలుకుంటున్నారని వివరించారు. రోజూ విద్యార్థుల ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ ప్రత్యేక హాజరు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్కూలు పరిసరాల్లోని నివాస సముదాయాల్లో ఉంటున్న వారికి వైరస్ పరీక్షలు చేపట్టినట్లు వివరించారు. గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ డిసీజ్ కంట్రోల్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..

ఏటా అక్టోబర్ నుంచి మార్చి మధ్య ప్రావిన్స్ లో నోరో వైరస్ విజృంభిస్తుందని అధికారులు తెలిపారు. వైరస్ బాధితులు ప్రధానంగా వాంతులు, విరేచనాలతో బాధపడుతుంటారని చెప్పారు. ఈ వైరస్ సాధారణమైందేనని, వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుందని వివరించారు. ఈ వైరస్ ను తొలిసారి 1968 లో అమెరికాలోని ఓహియో రాష్ట్రం నార్ వాక్ లోని ఓ స్కూలులో గుర్తించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ వైరస్ ను నోరో వైరస్ గా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు.

అమెరికాలో ఎక్కువగా ఆహారం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని చెప్పారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా 68.5 కోట్ల మంది ఈ వైరస్ బారిన పడుతుండగా.. అందులో 20 కోట్ల మంది ఐదేళ్లలోపు చిన్నారులేనని గణాంకాలు చెబుతున్నాయి. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 50 వేల మంది చిన్నారులు సహా 20 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని సమాచారం.


More Telugu News