ముప్పు ఎదురయ్యే అవకాశం: విమానయాన సంస్థలకు అమెరికా ఏవియేషన్ సంస్థ హెచ్చరిక

  • విమానయాన సంస్థలకు ఎఫ్ఏఏ హెచ్చరికలు
  • గగనతలం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచన
  • 60 రోజుల వరకు ఈ నోటీసు అమల్లో ఉంటుందన్న ఎఫ్ఏఏ
మెక్సికోపై దాడి చేయడానికే అమెరికా విమానయాన సంస్థలకు ఆ దేశ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) నోటీసులు జారీ చేసిందా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. తన విమానయాన సంస్థలకు ఎఫ్ఏఏ హెచ్చరికలు జారీ చేసింది. మెక్సికో, సెంట్రల్ అమెరికా, పనామా సహా తూర్పు పసిఫిక్ మహా సముద్రంలోని కొన్ని ప్రాంతాల గగనతలం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది.

సైనిక కార్యకలాపాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని విమానయాన సంస్థలను హెచ్చరించింది. 60 రోజుల వరకు ఈ నోటీసు అమల్లో ఉంటుందని తెలిపింది. విమానం ఎంత ఎత్తులో ఉన్నా, ల్యాండింగ్, టేకాఫ్ దశల్లో ఉన్నప్పటికీ వాటికి ముప్పు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని నోటీసుల్లో పేర్కొంది.

సాధారణంగా సమీప ప్రాంతాల్లో యుద్ధం లేదా ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సమయాల్లో ఇలాంటి నోటీసులు జారీ చేస్తారు. మెక్సికోలో ఉన్న మాదకద్రవ్యాల ముఠాలు, స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామంటూ ఇటీవల ట్రంప్ హెచ్చరించారు. మెక్సికో, క్యూబా, కొలంబియా వంటి దేశాలు మాదకద్రవ్యాలను తయారు చేస్తూ అమెరికాలోకి అక్రమంగా సరఫరా చేస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. ఈ క్రమంలో ఎఫ్ఏఏ హెచ్చరికలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.


More Telugu News