గుండె ఆపరేషన్లకు టైమ్ ముఖ్యమా? కొత్త అధ్యయనంలో కీలక విషయాలు!

  • మధ్యాహ్నం వేళల్లో చేసే గుండె సర్జరీలతో మరణాల ముప్పు ఎక్కువ
  • ఉదయం పూటతో పోలిస్తే 18 శాతం అధిక ముప్పు ఉన్నట్టు వెల్లడి
  • శరీర గడియారం (బాడీ క్లాక్) ప్రభావమే కారణమని అంచనా
  • వ్యక్తుల బాడీ క్లాక్‌కు అనుగుణంగా సర్జరీలు చేస్తే మేలని సూచన
గుండెకు చేసే ఆపరేషన్ల విషయంలో సమయం కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఉదయం ఆలస్యంగా, లేదా మధ్యాహ్నం ప్రారంభించే సర్జరీల వల్ల గుండె సంబంధిత మరణాల ముప్పు ఎక్కువగా ఉంటుందని తేలింది. యూకేలోని మాంచెస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు.

ఇంగ్లండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన 24,000 మందికి పైగా రోగుల డేటాను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. ఉదయం త్వరగా (7:00 నుంచి 9:59 గంటల మధ్య) చేసే సర్జరీలతో పోలిస్తే, ఉదయం ఆలస్యంగా మొదలుపెట్టే సర్జరీల వల్ల గుండె సంబంధిత కారణాలతో మరణించే ప్రమాదం 18 శాతం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అయితే, సర్జరీ తర్వాత వచ్చే సమస్యలు, తిరిగి ఆసుపత్రిలో చేరడం వంటి వాటిపై సమయం ప్రభావం చూపలేదని స్పష్టం చేశారు.

మన శరీరంలోని కణాలు, అవయవాల్లో 24 గంటల జీవ గడియారం (బాడీ క్లాక్) పనిచేస్తుంటుంది. దీని ప్రభావమే సర్జరీ ఫలితాలపై పడుతోందని పరిశోధకులు భావిస్తున్నారు. అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ గారెత్ కిచెన్ మాట్లాడుతూ.. "ఈ ముప్పు గణాంకాల పరంగా ముఖ్యమైనదే అయినా, ప్రమాదం తక్కువే. చాలా మందిపై దీని ప్రభావం ఉండకపోవచ్చు. అయినప్పటికీ, రోగులకు సాధ్యమైనంత ఉత్తమ ఫలితాలు అందించడం వైద్యులుగా మా కర్తవ్యం. సర్జరీ వేళలను మార్చడం అనేది పెద్ద ఖర్చులేని పద్ధతి" అని వివరించారు.

భవిష్యత్తులో వ్యక్తుల శరీర గడియారాల్లోని తేడాలను (కొందరు ఉదయాన్నే చురుగ్గా ఉండటం, మరికొందరు రాత్రిపూట చురుగ్గా ఉండటం) అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా సర్జరీలను షెడ్యూల్ చేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అధ్యయన వివరాలు 'అనస్థీషియా' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.


More Telugu News