ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం .. తప్పిన పెనుప్రమాదం

  • తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు ఫ్లైఓవర్‌పై ఘటన 
  • ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో షార్ట్ సర్క్యూట్
  • మంటలు గుర్తించి అప్రమత్తమై ప్రయాణికులను దించేసిన డ్రైవర్
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కొవ్వూరు ఫ్లైఓవర్‌పై ఈ రోజు వేకువజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఖమ్మం నుండి విశాఖపట్నం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సెల్ఫ్ మోటార్‌లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.
 
డీఎస్పీ దేవకుమార్‌, సీఐ కె. విశ్వం తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్‌పైకి చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటల్ని గుర్తించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
 
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమై సుమారు రూ.80 లక్షల మేర నష్టం వాటిల్లిందని కొవ్వూరు అగ్నిమాపక అధికారి ఏవీఎన్ఎస్ వేణు తెలిపారు. 


More Telugu News