ప్రతినెలా 5 వేల మంది ఉద్యోగుల తొలగింపు... అసలు కారణం చెప్పిన జొమాటో సీఈవో

  • మోసాల కారణంగా నెలకు 5 వేల మందిని తొలగిస్తున్నామన్న జొమాటో
  • దాదాపు 2 లక్షల మంది సొంతంగానే వైదొలగుతున్నారని వెల్లడి
  • యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో వివరాలు తెలిపిన సీఈఓ దీపిందర్ గోయల్
  • గిగ్ వర్కర్ల కోసం కేంద్రం కొత్త కార్మిక చట్టాల రూపకల్పన
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోలో ప్రతినెలా దాదాపు 5,000 మంది గిగ్ వర్కర్లను తొలగించడడం వెనుక ఉన్న అసలు కారణాన్ని కంపెనీ సీఈవో దీపిందర్ గోయల్ వెల్లడించారు. మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడటం వల్లే వారిని తొలగించాల్సి వస్తోందని ఆయన స్పష్టం చేశారు. 

కేవలం తొలగింపులే కాకుండా, ప్రతి నెలా సుమారు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది వర్కర్లు స్వచ్ఛందంగానే ప్లాట్‌ఫామ్‌ను వీడి వెళుతున్నారని ఆయన తెలిపారు. యూట్యూబర్ రాజ్ శ్యామానీతో జరిపిన ఒక వీడియో పాడ్‌కాస్ట్‌లో గోయల్ ఈ వివరాలను పంచుకున్నారు. గిగ్ వర్క్‌ను చాలామంది ఒక తాత్కాలిక ఉపాధిగానే భావిస్తున్నారని, అందుకే ఇంత పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా వెళ్లిపోతున్నారని ఆయన విశ్లేషించారు.

ఇదిలా ఉండగా, మెరుగైన వేతనాలు, మెరుగైన పని పరిస్థితులు, భద్రతా కవరేజీ వంటి డిమాండ్లతో జొమాటోతో సహా పలు క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన గిగ్ వర్కర్లు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. గిగ్ వర్కర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్లు, వారి హక్కుల పరిరక్షణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నాలుగు కొత్త కార్మిక చట్టాలకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఈ కొత్త చట్టాల ద్వారా గిగ్ వర్కర్లకు కూడా కనీస వేతనం, ఆరోగ్యం, వృత్తిపరమైన భద్రత, సామాజిక భద్రత వంటి ప్రయోజనాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.





More Telugu News