ఈరోజు ఫెయిల్ అవండి!: ఇదే నూతన సంవత్సర చివరి సందేశం అంటూ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్

  • ఎవరూ మద్యం తాగి వాహనం నడపవద్దని సూచన
  • పరీక్షలలో 35 మార్కులు వస్తే గట్టెక్కినట్లేనని వ్యాఖ్య
  • డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మాత్రం ఔట్ అయినట్లేనని వెల్లడి
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ 'ఎక్స్' వేదికగా ఒక ట్వీట్ చేశారు. "నూతన సంవత్సర వేడుకలకు ఇది నా చివరి సందేశం" అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడపవద్దని ఆయన సూచించారు. ఈ మేరకు ఆయన ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈరోజు ఫెయిల్ కావడానికి ప్రయత్నించండని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ మీరు పాస్ అయితే చంచల్‌గూడ జైలుకు పంపించబడతారని, అక్కడ ఉచిత భోజనం ఉంటుందని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

విద్యా పరీక్షలలో 35 మార్కులు వస్తే ఉత్తీర్ణులైనట్లేనని, కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ మీటర్‌లో 35 (బీఏసీ) దాటితే మాత్రం అనర్హులవుతారని ఆయన పేర్కొన్నారు. పరీక్షలలో ఫెయిలైతే ఏడాది మాత్రమే నష్టపోతామని, కానీ రోడ్డు మీద తేడా కొడితే జీవితం ఆగమవుతుందని ఆయన సున్నితంగా హెచ్చరించారు. అందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

మన రోడ్లు రక్తసిక్తం కావడానికి తాము అంగీకరించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. యువత బాధ్యత కంటే మద్యం ఎక్కువ అని భావిస్తే, చట్టపరంగా చర్యలు తప్పవని ఆయన అన్నారు. నూతన సంవత్సర బహుమతిగా ఆసుపత్రి బిల్లులు చెల్లించడం లేదా ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోవడం కాకుండా, సురక్షితంగా ఇంటికి వెళ్లడం మంచిదని ఆయన సూచించారు. తాగి వాహనం నడపడాన్ని హైదరాబాద్ పోలీసులు ఏమాత్రం సహించరని ఆయన స్పష్టం చేశారు.


More Telugu News