కోచ్‌గా వచ్చే ఆలోచన ఉందా?.. బ్యాటింగ్ లెజెండ్ ను సంప్రదించిన బీసీసీఐ!

  • దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత వీవీఎస్ లక్ష్మణ్‌ను సంప్రదించిన బోర్డు వర్గాలు!
  • టెస్ట్ కోచ్ బాధ్యతలపై ఆసక్తి లేదని స్పష్టం చేసిన లక్ష్మణ్!
  • గంభీర్ కోచింగ్ శైలిపై డ్రెస్సింగ్ రూమ్‌లో అసంతృప్తిగా ఉన్న ఆటగాళ్లు
  • టీ20 ప్రపంచకప్ ప్రదర్శనపై ఆధారపడిన గంభీర్ భవిష్యత్తు
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను టెస్టు కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు తెలుస్తోంది. వైట్ బాల్ క్రికెట్‌లో భారత్‌కు ఐసీసీ, ఆసియా కప్ ట్రోఫీలు అందించి మంచి రికార్డు సాధించినప్పటికీ, టెస్టుల్లో గంభీర్ పనితీరుపై బీసీసీఐ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా గత నెలలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ ఓటమి పాలైన తర్వాత, బోర్డు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

ఈ ఓటమి అనంతరం బీసీసీఐ పెద్దలు, టీమిండియా దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్‌ను అనధికారికంగా సంప్రదించి, రెడ్ బాల్ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించే విషయంపై ఆరా తీసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) హెడ్‌గా తన పాత్రతో సంతృప్తిగా ఉన్న లక్ష్మణ్, ఈ ప్రతిపాదన పట్ల ఆసక్తి చూపలేదని తెలిసింది.

గంభీర్ కాంట్రాక్ట్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఉన్నప్పటికీ, అతని కోచింగ్ శైలిపై డ్రెస్సింగ్ రూమ్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ ద్రవిడ్ హయాంలో ఆటగాళ్లకు లభించిన భరోసా, స్వేచ్ఛ గంభీర్ కోచింగ్‌లో లోపించిందని, శుభ్‌మన్ గిల్ వంటి కీలక ఆటగాడిని టీ20 ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించడం చాలా మందిలో అభద్రతా భావాన్ని నింపిందని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి.

"గంభీర్‌కు బోర్డులో గట్టి మద్దతు ఉంది. రాబోయే టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధిస్తే అతని స్థానానికి ఢోకా ఉండదు. కానీ, టెస్టుల్లో కూడా అతన్నే కొనసాగిస్తారా అనేది ఆసక్తికరం. లక్ష్మణ్ ఆసక్తిగా లేకపోవడంతో ప్రత్యామ్నాయాలు కూడా తక్కువే ఉన్నాయి" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక బీసీసీఐ అధికారి పీటీఐకి తెలిపారు. టీ20 ప్రపంచకప్ ప్రదర్శన తర్వాత, స్ల్పిట్ కోచింగ్ లేదా ఏకైక కోచ్ విధానంపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


More Telugu News