చంద్రబాబు కాళ్ల వద్ద బతికినోళ్లం కాదు: రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు

  • ముఖ్యమంత్రిగా ఉండి వీపులు పగులగొడతాననడం ఏమిటని ప్రశ్న
  • 2029లో బీఆర్ఎస్ 90 సీట్లు గెలుచుకుంటుందని ధీమా
  • రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మక్తల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణకు ద్రోహం చేసిన చంద్రబాబు కాళ్ల వద్ద బతికిన వ్యక్తులం కాదని, జైలుకు వెళ్ళి బతకాల్సిన అవసరం తనకు లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి వీపులు పగులగొడతానని మాట్లాడటం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

మక్తల్‌లో మీడియాతో మాట్లాడుతూ, తమకు తిట్టడం చేతకాక కాదని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డిలా బ్రోకర్ పనులు చేసి తాము బతకలేదని, అందుకే తాము తిట్టలేదని అన్నారు. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పాలమూరులో నీళ్లు కూడా లేవని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని ఆయన కొనియాడారు.

2029లో బీఆర్ఎస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము 90 స్థానాల్లో గెలుస్తామని, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 150 స్థానాలకు 120 చోట్ల తప్పకుండా గెలుస్తామని అన్నారు.

రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు చేస్తున్న భూదందా గురించి ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. మంత్రులు కూడా రాష్ట్రాన్ని దోచుకుంటన్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ సొమ్మును ఆయన సూట్‌కేసులలో ఢిల్లీకి పంపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల డబ్బును తీసుకెళ్లి ఏఐసీసీకి ఇస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణను ధనిక రాష్ట్రంగా మార్చారని, అలాంటి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కొల్లగొడుతున్నారని విమర్శించారు.


More Telugu News