ధోని కోసం మా పిల్లలు నన్నే 'ట్రోల్' చేశారు... బాబుల్ సుప్రియో ఆసక్తికర పోస్ట్

  • రాంచీలో ధోనీని కలిసేందుకు వెళ్లిన బాబుల్ సుప్రియో కుమార్తె, ఆమె కజిన్
  • మా నాన్న మంత్రి అని చెప్పినా వాళ్లను లోపలికి అనుమతించని ధోనీ సిబ్బంది
  • బాబుల్ సుప్రియో కూడా నిస్సహాయుడిగా మారిన వైనం
ప్రముఖ గాయకుడు, నటుడు మరియు రాజకీయ నాయకుడు బాబుల్ సుప్రియో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన, పాత జ్ఞాపకాన్ని పంచుకున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని కలవలేకపోయినందుకు తన పిల్లలు తననే ఎలా ఆటపట్టించారో వివరించారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.

"ఈ సంఘటన రాంచీలోని ధోని ఇంటి గేటు ముందు జరిగింది. నా కుమార్తె నైనా, ఆమె కజిన్ గోలు తమ తాతయ్య, అమ్మమ్మలతో కలిసి రాంచీ వెళ్లారు. అక్కడ ధోనిని కలవడానికి వాళ్లు నేరుగా అతడి ఇంటి వద్దకు వెళ్లారు. ధోనీ ఇంటి గేటు ముందు నిల్చుని లోపలికి వెళ్లేందుకు విశ్వప్రయత్నం చేశారు. ధోనీని కలిసేందుకు వారు చేయని ప్రయత్నమంటూ లేదు.  అక్కడున్న వాచ్‌మన్‌కి నా విజిటింగ్ కార్డు ఇచ్చారు. అంతేకాకుండా, "మా నాన్న మంత్రి" అని కూడా చెప్పారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో నాకు ఫోన్ చేశారు. 

కానీ ఈ విషయంలో నేను కూడా నిస్సహాయుడ్ని అయ్యాను. ఎందుకంటే ధోనీతో మాట్లాడడానికి అతడి ఫోన్ నెంబరు నా వద్ద లేదు. ధోనీ ఫోన్ చాలా తక్కువగా ఉపయోగిస్తాడట. అది కూడా అతడి ఫోన్ నెంబరు చాలా కొద్దిమంది వద్దే ఉంటుందట. ఈ విషయాన్ని మా పిల్లలతో చెబితే వాళ్లు నన్ను భయంకరంగా ట్రోల్ చేశారు. 'డంబో (దద్దమ్మ)' అంటూ వాయిస్ మెసేజ్ లు పెడుతూ ఓ రేంజిలో నన్ను ఆడుకున్నారు.  నేను ఆ సమయంలో ఏం చేయలేకపోయినందుకు బాధపడ్డాను. కానీ, తరాలకతీతంగా ధోని సంపాదించుకున్న ప్రేమను చూస్తే చాలా ముచ్చటగా అనిపించింది" అని బాబుల్ సుప్రియో వివరించారు.


More Telugu News