అండర్-19 ఆసియా కప్ విజేత పాక్... ఫైనల్లో భారత్ ఘోర పరాజయం

  • దుబాయ్ వేదికగా అండర్-19 ఆసియా కప్ ఫైనల్
  • 191 పరుగుల తేడాతో ఓడిన భారత్
  • తొలుత 50 ఓవర్లలో 8 వికెట్లకు 347 రన్స్ చేసిన పాక్
  • లక్ష్యఛేదనలో 26.2 ఓవర్లలో 156 పరుగులకే భారత్ ఆలౌట్
టైటిల్ ఫేవరెట్ గా బరిలో దిగిన భారత కుర్రాళ్లకు అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో నేడు జరిగిన ఫైనల్లో భారత్ 191 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబర్చిన పాక్ జట్టు టైటిల్ ను చేజిక్కించుకుంది. 

దుబాయ్ లోని ఐసీసీ అకాడమీ స్టేడియంలో జరిగి ఈ మ్యాచ్ లో భారత్ తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 347 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ సమీర్ మిన్హాస్ 172 పరుగులతో అద్భుత శతకం చేశాడు. అనంతరం 348 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ దారుణంగా విఫలమైంది. స్టార్ బ్యాటర్లు ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. దాంతో 26.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటైంది.

భారత ఇన్నింగ్స్ లో బౌలర్ దీపేశ్ దేవేంద్రన్ 36 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వైభవ్ సూర్య వంశీ 26, కెప్టెన్ ఆయుష్ మాత్రే 2, ఆరోన్ జార్జ్ 16, విహాన్ మల్హోత్రా 7, వేదాంత్ త్రివేది 9, అభిజ్ఞాన్ కుందు 13, కనిష్క్ చౌహాన్ 9, ఖిలన్ పటేల్ 19, హెనిల్ పటేల్ 6, కిషన్ సింగ్ 3 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో అలీ రెజా 4 వికెట్లతో భారత్ ను దెబ్బతీశాడు. మహ్మద్ సయ్యాం 2, అబ్దుల్ సుభాన్ 2, హుజైపా అహ్సాన్ 2 వికెట్లు తీశారు. 


More Telugu News