చార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పటి నుంచి అమలు అంటే...!

  • టికెట్ ధరలు సవరించిన భారతీయ రైల్వే శాఖ
  • స్వల్ప దూర ప్రయాణాల టికెట్ ధరలు యథాతథం
  • వివిధ కేటగిరీల టికెట్ ధరలపై ఓ మోస్తరు పెంపు
భారతీయ రైల్వే శాఖ టికెట్ ధరలను సవరించింది. ఏడాదికి రూ.600 కోట్ల ఆదాయం పొందడమే లక్ష్యంగా, టికెట్ ధరలను పెంచింది. పెంచిన ధరలు డిసెంబరు 26 నుంచి అమల్లోకి వస్తాయని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 

తాజా ధరల సవరణ ప్రకారం... 215 కిలోమీటర్ల వరకు జనరల్ టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అంతకుమించి ఎక్కువ దూరం ప్రయాణించే వారికి కిలోమీటరుకు 1 పైసా చొప్పున అదనపు చార్జీ పడుతుంది. అదే సమయంలో ఎక్స్ ప్రెస్, మెయిల్, నాన్ ఏసీ రైళ్లలో కిలోమీటరుకు రెండు పైసలు చొప్పున పెరగనుంది. అటు, నాన్ ఏసీ రైళ్లలో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి టికెట్ పై అదనంగా రూ.10 పెంచారు.

గడచిన దశాబ్దకాలంలో రైల్వే శాఖ తన కార్యకలాపాలను మరింత విస్తృతం చేసిందని, అందుకు అనుగుణంగా మానవ వనరుల శక్తి పెంచుకోవాల్సి ఉందని, ఆదాయం కూడా అవసరమని రైల్వే శాఖ తన ప్రకటనలో పేర్కొంది. 2024-25లో జీతాలు, ఇతర ఖర్చుల రూపేణా రూ.1.15 లక్షల కోట్లు చెల్లించగా, రూ.60 వేల కోట్లతో పెన్షన్లు చెల్లించామని, మొత్తంగా రూ.2.63 లక్షల కోట్ల వ్యయం అయిందని రైల్వే శాఖ వివరించింది. ఆదాయ పెంపు మార్గాల్లో భాగంగా ప్రయాణికులపై చార్జీలు పెంచడంతో పాటు సరకు రవాణాను అధికం చేయడంపైనా దృష్టిసారిస్తున్నామని వివరించింది. 


More Telugu News