కోతికి గుడి కట్టి పూజలే కాదు... జాతరలు కూడా చేస్తున్నారు... ఎక్కడంటే...!

  • నిర్మల్ జిల్లా ధర్మారం గ్రామంలో కోతి దేవుడి జాతర
  • 1976లో మరణించిన వానరానికి ఆలయం కట్టిన గ్రామస్థులు
  • ఏటా జరిగే ఉత్సవాలకు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు
  • పదేళ్ల తర్వాత 'జడకొప్పు' కార్యక్రమాన్ని పునఃప్రారంభించిన కమిటీ
సాధారణంగా మనం శివుడు, రాముడు, హనుమంతుడు వంటి దేవుళ్లకు ఆలయాలు ఉండటం చూస్తుంటాం. కానీ, నిర్మల్ జిల్లాలో ఏకంగా ఓ కోతికి గుడి కట్టి, ఏటా జాతర నిర్వహిస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. లక్ష్మణచాంద మండలం ధర్మారం గ్రామంలోని ఈ 'కోతి దేవుడి' ఆలయంలో వార్షిక జాతర తాజాగా కన్నుల పండువగా జరిగింది.
 
వివరాల్లోకి వెళ్తే..1976లో ఈ గ్రామంలో ఓ వానరం మరణించింది. దానికి గ్రామస్థులంతా కలిసి శాస్త్రోక్తంగా సమాధి నిర్మించారు. అనంతరం దానిపై ఓ ఆలయాన్ని నిర్మించి, 'కోతి దేవుడు'గా కొలుస్తూ నిత్యం పూజలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విశిష్ట సంప్రదాయం దాదాపు 48 ఏళ్లుగా కొనసాగుతోంది.
 
ఈ ఏడాది జరిగిన జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా, పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ తాగునీరు, అన్నదానం వంటి ఏర్పాట్లు చేసింది.
 
కాగా, గత పదేళ్లుగా నిలిచిపోయిన 'జడకొప్పు' కార్యక్రమాన్ని ఈ ఏడాది పునఃప్రారంభించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఒక మూగజీవిపై గ్రామస్థులు చూపిస్తున్న ఈ అపారమైన భక్తి, తరతరాలుగా కొనసాగిస్తున్న సంప్రదాయం ప్రత్యేకంగా నిలుస్తోంది.
 


More Telugu News