ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

  • ఎమ్మెల్యేల ఫిరాయింపుపై బీఆర్ఎస్ పిటిషన్లు
  • విచారణ చేపట్టిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
  • ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్ల కొట్టివేత
  • పార్టీ మారినట్టు సరైన ఆధారాలు లేవన్న స్పీకర్ ప్రసాద్
  • సాంకేతికంగా వారు ఇంకా బీఆర్ఎస్ సభ్యులేనని వెల్లడి
  • దానం, కడియం పిటిషన్లపై కొనసాగుతున్న విచారణ
గత ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు ఇచ్చారు. ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ఆయన బుధవారం తోసిపుచ్చారు.

ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డిలపై అనర్హత వేటు వేయడానికి తగిన ఆధారాలు లేవని స్పీకర్ తన తీర్పులో స్పష్టం చేశారు. వారు పార్టీ మారినట్లు నిర్దిష్ట ఆధారాలను పిటిషనర్లు సమర్పించలేకపోయారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు సాంకేతికంగా ఇంకా బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నారని స్పీకర్ నిర్ధారించారు. ఈ తీర్పు బీఆర్ఎస్ వర్గాలకు ఊహించని షాక్‌గా మారింది.

కాగా, ఇదే వ్యవహారంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ ఇంకా పూర్తి కాలేదని, అది కొనసాగుతోందని స్పీకర్ కార్యాలయం తెలిపింది. దానం, కడియం స్పీకర్ నోటీసులపై వివరణ ఇచ్చేందుకు సమయం కోరినట్టు తెలుస్తోంది. వారు సమాధానం ఇచ్చాక త్వరలోనే వాటిపై కూడా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.


More Telugu News