జియో నుంచి 'హ్యాపీ న్యూ ఇయర్ 2026' రీఛార్జ్‌ ప్లాన్స్

  • రూ.500 ప్లాన్‌తో గూగుల్ జెమిని ప్రో సేవలు ఉచితం
  • రోజుకు 2.5GB డేటాతో కొత్త వార్షిక ప్లాన్
  • పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత యాక్సెస్
  • 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఏఐ సర్వీస్ వర్తింపు
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం 'హ్యాపీ న్యూ ఇయర్ 2026' పేరుతో ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా నెలవారీ, వార్షిక, డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లను ప్రవేశపెట్టింది. ఈ అన్ని ప్లాన్లతోనూ గూగుల్ జెమిని ప్రో ఏఐ సర్వీస్‌ను ఉచితంగా అందిస్తుండటం విశేషం.

కొత్తగా తీసుకొచ్చిన 'హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్' ధర రూ.500గా ఉంది. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌తో రోజుకు 2GB డేటా, అపరిమిత 5G యాక్సెస్ లభిస్తుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ ద్వారా లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ నెక్స్ట్, ప్లానెట్ మరాఠీ, ఫ్యాన్‌కోడ్ వంటి పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత యాక్సెస్ పొందవచ్చు. అంతేకాకుండా రూ.35,100 విలువైన 18 నెలల గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది.

ఇక, వార్షిక ప్లాన్ ధరను రూ.3,599గా నిర్ణయించారు. 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.5GB డేటా, అపరిమిత 5G డేటా, కాల్స్, ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌కు కూడా 18 నెలల గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్ వర్తిస్తుంది. వీటితో పాటు రూ.103తో 28 రోజుల వ్యాలిడిటీతో 5GB డేటా అందించే 'ఫ్లెక్సీ ప్యాక్' అనే డేటా యాడ్-ఆన్ ప్లాన్‌ను కూడా జియో తీసుకొచ్చింది. అయితే, గూగుల్ జెమిని ప్రో సేవలు 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది.


More Telugu News