స్మృతి మంధాన పెళ్లి రద్దు వెనుక పెద్ద ట్రెండ్!

  • ఇండోర్‌లో 40 రోజుల్లో 150కి పైగా పెళ్లిళ్లు రద్దు
  • 62 శాతం వివాహాలు సోషల్ మీడియా కారణంగానే బ్రేకప్
  • క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి రద్దుతో వెలుగులోకి వచ్చిన ట్రెండ్
  • పాత బంధాలకు సంబంధించిన పోస్టులే ప్రధాన సమస్యగా గుర్తింపు
  • పెళ్లిళ్ల రద్దుతో రూ. 25 కోట్ల మేర ఆర్థిక నష్టం
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం చివరి నిమిషంలో రద్దయిన వార్త ఇటీవల చర్చనీయాంశమైంది. అయితే ఇది కేవలం ఒక సెలబ్రిటీ విషయానికే పరిమితం కాలేదు. దీని వెనుక ఇప్పుడు ఓ పెద్ద ట్రెండ్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గత 40 రోజుల్లోనే 150కి పైగా పెళ్లిళ్లు చివరి నిమిషంలో రద్దయ్యాయి. ఈ పరిణామం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

దైనిక్ భాస్కర్ నివేదిక ప్రకారం.. ఈ పెళ్లిళ్ల రద్దుకు ప్రధాన కారణం సోషల్ మీడియా. రద్దయిన వివాహాల్లో ఏకంగా 62 శాతం సోషల్ మీడియాలో పాత పోస్టులు, కామెంట్లు, స్నేహితుల జాబితా వంటి కారణాలతోనే ఆగిపోయినట్లు తేలింది. గతంలో భాగస్వామికి ఉన్న సంబంధాల గురించి పాత పోస్టుల ద్వారా తెలియడంతో కొత్త వివాదాలు తలెత్తి బంధాలు పెటాకులవుతున్నాయి. మిగిలిన పెళ్లిళ్లు కుటుంబంలో మరణాలు, అనారోగ్యాలు, పరస్పర గొడవల వల్ల రద్దయ్యాయి.

ఈ ట్రెండ్‌కు కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. ప్రీ-వెడ్డింగ్ షూట్ సమయంలో వధువు పాత సోషల్ మీడియా పోస్టుల గురించి గొడవపడి ఓ జంట పెళ్లిని రద్దు చేసుకుంది. మరో ఘటనలో, దాదాపు కోటి రూపాయల బడ్జెట్‌తో జరిగిన సంగీత్ వేడుక తర్వాత వధువు కనిపించకుండా పోయింది. తీరా చూస్తే ఆమెకు మరొకరితో సంబంధం ఉందని తేలింది.

గతంలో వరకట్నం వంటి కారణాలతో పెళ్లిళ్లు ఆగిపోయేవి. కానీ ఇప్పుడు 60 నుంచి 70 శాతం కేసులు సోషల్ మీడియాకు సంబంధించినవే ఉంటున్నాయి. ఈ పరిణామం ఇండోర్‌లోని వెడ్డింగ్ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. హోటళ్లు, క్యాటరర్లు, డెకరేటర్లు, వెడ్డింగ్ ప్లానర్లు ఇలా అందరూ కలిసి సుమారు రూ. 25 కోట్ల వరకు నష్టపోయినట్లు హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు సుమిత్ సూరి తెలిపారు. 


More Telugu News