మరో వివాదంలో తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్

  • మరోసారి వార్తల్లో తిరువూరు ఎమ్మెల్యే 
  • సొంత పార్టీ మండల అధ్యక్షుడిపై వాట్సాప్ స్టేటస్‌తో ఆరోపణలు
  • పేకాట క్లబ్ నడుపుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. సొంత పార్టీ నేతలే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, పెడుతున్న పోస్టులు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై చేసిన ఆరోపణల వివాదం ఇంకా చల్లారకముందే, ఆయన మరో కొత్త వివాదానికి తెరలేపారు.

తాజాగా, విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావును టార్గెట్ చేస్తూ కొలికపూడి పెట్టిన వాట్సాప్ స్టేటస్ దుమారం రేపుతోంది. "నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్‌కా? కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్. పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే.. నువ్వు నిజంగా రాయల్" అంటూ ఆయన తన స్టేటస్‌లో ఘాటుగా విమర్శించారు. రాయల సుబ్బారావు, ఎంపీ కేశినేని చిన్ని వర్గానికి చెందిన వ్యక్తిగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొలికపూడి ఆయన్ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఎంపీ కేశినేని చిన్నిపై కొలికపూడి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించేందుకు చిన్ని డబ్బులు డిమాండ్ చేశారని, మాఫియాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ కావడంతో పార్టీ క్రమశిక్షణా సంఘం విచారణ జరుపుతోంది. ఈ కమిటీ ముందు హాజరై కొలికపూడి వివరణ కూడా ఇచ్చారు.

పాత వివాదంపై క్రమశిక్షణా కమిటీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే, కొలికపూడి మరోసారి సొంత పార్టీ నేతపై ఆరోపణలు చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కొత్త వివాదంపై టీడీపీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.


More Telugu News