గూగుల్‌లో ట్రెండ్‌ అవుతున్న ‘777’.. అసలు కారణం ఇదే!

  • గూగుల్‌లో వైరల్‌గా మారిన ‘777’ నంబర్
  • ఎయిర్ ఫ్రాన్స్ బోయింగ్ 777 విమాన సర్వీసుల విస్తరణ
  • పలు నగరాలకు విలాసవంతమైన ‘లా ప్రీమియర్’ సేవలు ప్రారంభం
  • ఈ కొత్త సర్వీసుల వల్లే గూగుల్‌లో హఠాత్తుగా ట్రెండ్‌ అయిన ‘777’
ఈరోజు మీరు గూగుల్ ట్రెండ్స్ చూసి ఉంటే, ‘777’ అనే నంబర్ ట్రెండింగ్‌లో ఉండటం గమనించి ఉంటారు. ఇదేదో మిస్టరీ లేదా సోషల్ మీడియా మీమ్ అనుకుంటే పొరపాటే. దీని వెనుక ఉన్న అసలు కారణం విమానయాన రంగానికి, ముఖ్యంగా తరచూ ప్రయాణించే వారికి సంబంధించినది.

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఫ్రాన్స్ తమ బోయింగ్ 777-300ER విమాన సర్వీసులను భారీగా విస్తరించడమే ఈ ట్రెండింగ్‌కు కారణం. ఈ రకం విమానాలతో పారిస్ (CDG) నుంచి నాలుగు కొత్త గమ్యస్థానాలకు తమ అత్యంత విలాసవంతమైన ‘లా ప్రీమియర్’ సర్వీసులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో అట్లాంటా (ATL), బోస్టన్ (BOS), హ్యూస్టన్ (IAH), టెల్ అవీవ్ (TLV) నగరాలు ఉన్నాయి.

ఈ నిర్ణయంతో ఎయిర్ ఫ్రాన్స్ తమ లాంగ్-హాల్ మార్గాల్లో మరింత పట్టు సాధించనుంది. ఆధునిక సౌకర్యాలతో కూడిన కొత్త లా ప్రీమియర్ సూట్లు, రిఫ్రెష్ చేసిన బిజినెస్-క్లాస్ క్యాబిన్లతో ప్రయాణికులకు మెరుగైన అనుభూతిని అందించనుంది. ఏవియేషన్ ఏ2జడ్ (Aviation A2Z) కథనం ప్రకారం.. ఈ విస్తరణతో లా ప్రీమియర్ నెట్‌వర్క్ 40శాతం పెరిగింది.

ఈ కొత్త సర్వీసుల ప్రకటన వెలువడగానే, విలాసవంతమైన ప్రయాణ అనుభవం గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపడంతో ‘777’ గూగుల్‌లో ట్రెండింగ్‌గా మారింది.




More Telugu News