సంచార్ సాథీ యాప్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం

  • విపక్షాల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
  • ప్రీ-ఇన్‌స్టలేషన్ తప్పనిసరి కాదని స్పష్టీకరణ
  • ఈ యాప్ ద్వారా ఫోన్‌లలోని వ్యక్తిగత గోప్యతకు భంగమన్న విపక్షాలు
మొబైల్ ఫోన్‌లలో సంచార్ సాథీ యాప్ ప్రీ-ఇన్‌స్టలేషన్‌పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో, ఈ యాప్ ప్రీ-ఇన్‌స్టలేషన్ తప్పనిసరి కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ముందస్తు ఇన్‌స్టలేషన్ ఉత్తర్వును వెనక్కి తీసుకుంది.

కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో, అలాగే ఇప్పటికే ఉన్న పరికరాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా సంచార్ సాథీ యాప్‌ను ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం (డీవోటీ) నవంబర్ 28న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయంపై ఇప్పుడు కేంద్రం వెనక్కి తగ్గింది.

సైబర్ నేరాల నుంచి రక్షణ కోసం సంచార్ సాథీ యాప్‌ను ముందస్తుగానే ఇన్‌స్టాల్ చేసి ఇవ్వాలన్న కేంద్రం ఆదేశాలు దుమారం రేపాయి. ఇది ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటమేనని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే, యాప్‌ను ఇన్‌స్టాల్ చేసినప్పటికీ, వినియోగదారులు తొలగించుకోవచ్చని, రిజిస్టర్ అయిన తర్వాతే అది పనిచేయడం ప్రారంభిస్తుందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయినప్పటికీ, ప్రతిపక్షాలు తమ ఆందోళనను కొనసాగించాయి. ఇదిలా ఉండగా, ఇప్పటికే 1.5 కోట్ల మందికి పైగా సంచార్ సాథీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.


More Telugu News