: హెలిస్కామ్ దర్యాప్తు కోసం ఇటలీకి సీబీఐ బృందం


3600కోట్ల రూపాయల హెలికాప్టర్ల స్కాములో సీబీఐ విచారణ రేపటితో పట్టాలెక్కుతోంది. ఈ స్కామును ఇటలీ పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. హెలికాప్టర్ల సరఫరా ఒప్పందాన్ని సొంతం చేసుకునేందుకు ఇటలీకి చెందిన ఫిన్ మెక్కానికా భారత్ లో 360 కోట్ల రూపాయల వరకూ లంచాలు మేపినట్లు ఇటలీ దర్యాప్తు అధికారులే వెల్లడించారు. దీంతో సీబీఐ దర్యాప్తునకు రక్షణ శాఖ ఆదేశించింది.

అయితే దర్యాప్తు మొదలు పెట్టడానికి ప్రాథమిక ఆధారాలు కూడా లేవని సీబీఐ అధికారులు మొత్తుకున్నారు. కనీసం ఆరోపణలకు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారమైనా అందజేయాలని సీబీఐ రక్షణ శాఖను కోరింది. అయినా లాభంలేదు. ఇక చేసేదేమీ లేక స్కాము వివరాలు తెలుసుకునేందుకు ఉన్నతాధికారుల బృందం సోమవారం ఇటలీకి బయలుదేరి వెళుతోంది.

ఈ బృందంలో సీబీఐ డీఐజీ, సీబీఐకే చెందిన న్యాయవాది, రక్షణ శాఖకు చెందిన సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారి, విదేశాంగ శాఖ అధికారి ఉంటారు. ఈ బృందం అగస్టా హెలికాప్టర్ల స్కామును దర్యాప్తు చేస్తున్న ఇటలీ పోలీసులను కలుస్తుంది. దర్యాప్తులో ఇప్పటి వరకూ వారు సేకరించిన సమాచారం, ఆధారాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుందని సమాచారం. వాస్తవానికి ఈ బృందం ఈ రోజే ఇటలీకి వెళ్లాల్సి  ఉంది. కానీ, చివరి నిమిషంలో కొన్ని కారణాల వల్ల రేపటికి వాయిదా పడింది.

  • Loading...

More Telugu News