కేబీఆర్ పార్క్ వద్ద స్మార్ట్ పార్కింగ్.. నేటి నుంచే ప్రారంభం

  •  కేబీఆర్ పార్క్ వద్ద పార్కింగ్ కష్టాలకు చెక్.. ఇక ట్రాఫిక్ జామ్‌కు చెక్
  • 72 కార్లు, ద్విచక్రవాహనాలు పార్క్ చేసేందుకు సౌకర్యం
  • మొబైల్ యాప్‌తో ముందుగానే స్లాట్ బుకింగ్ చేసుకునే వీలు
హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్క్ వద్ద వాహనదారుల పార్కింగ్ కష్టాలకు జీహెచ్ఎంసీ చెక్ పెట్టింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్ వ్యవస్థను నేటి నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సదుపాయంతో జాతీయ ఉద్యానవనం వద్ద ట్రాఫిక్ సమస్యలు తగ్గుముఖం పడతాయని అధికారులు భావిస్తున్నారు.

కేబీఆర్ పార్కుకు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్, జాగింగ్ కోసం వచ్చేవారు తమ వాహనాలను ప్రధాన రహదారిపైనే నిలుపుతుండటంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట వంటి ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌కు వెళ్లేందుకు ఇది కీలక మార్గం కావడంతో, రద్దీ సమయాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా జీహెచ్ఎంసీ మల్టీ లెవల్ స్మార్ట్ పార్కింగ్ నిర్మాణాన్ని చేపట్టింది.

ప్రైవేట్ ఏజెన్సీ భాగస్వామ్యంతో 405 చదరపు గజాల స్థలంలో ఈ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులో ఒకేసారి 72 కార్లను పార్క్ చేసే వీలుంది. మొత్తం స్థలంలో 20 శాతం ద్విచక్ర వాహనాల కోసం కేటాయించారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ముందుగానే పార్కింగ్ స్లాట్‌ను బుక్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


More Telugu News