లెక్చరర్ కాను.. ఎమ్మెల్యే అవుతానని చెప్పి గెలిచా: సీఎం చంద్రబాబు

  • అసెంబ్లీలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
  • మాక్ అసెంబ్లీ నిర్వహించిన 175 నియోజకవర్గాల విద్యార్థులు
  • మా ఎమ్మెల్యేల కన్నా మీరే బాగా చేశారన్న సీఎం చంద్రబాబు
  • 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యానని గుర్తుచేసుకున్న సీఎం
  • ఓటు హక్కు వజ్రాయుధంలాంటిదని విద్యార్థులకు పిలుపు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఈరోజు సంవిధాన్ దివస్ (రాజ్యాంగ దినోత్సవం) వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 175 నియోజకవర్గాల నుంచి ఎంపికైన విద్యార్థులు నిర్వహించిన 'మాక్ అసెంబ్లీ' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మాక్ అసెంబ్లీని తిలకించిన అనంతరం సీఎం చంద్రబాబు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు సభను నడిపిన తీరు అద్భుతంగా ఉందని ప్రశంసించారు. "మా ఎమ్మెల్యేలు కొన్నిసార్లు తడబడతారు. కానీ, మీరు మాత్రం ఏమాత్రం తడబడకుండా ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడారు. మీ ప్రతిభ అభినందనీయం" అని అన్నారు. బాధ్యత, చైతన్యం పెంచేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. "28 ఏళ్లకే నేను ఎమ్మెల్యే అయ్యాను. లెక్చరర్ ఉద్యోగంలో చేరమని మా వైస్ ఛాన్సలర్ అడిగితే, నేను ఎమ్మెల్యే అవుతానని చెప్పి 1978లో గెలిచి చూపించాను" అని తెలిపారు. నిరంతర శ్రమ, సంక్షోభాలను ధైర్యంగా ఎదుర్కోవడం వల్లే తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, చిన్న వయసులోనే మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎదిగానని వివరించారు.

రాజ్యాంగం దేశానికి ఆత్మలాంటిదని చంద్రబాబు పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముందుచూపుతో అద్భుతమైన రాజ్యాంగాన్ని రూపొందించారని కొనియాడారు. "రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే చెడు ఫలితాలు వస్తాయి. అమలు చేసేవారు మంచివారైతే చెడు రాజ్యాంగమైనా మంచి ఫలితాలను ఇస్తుంది" అని అంబేద్కర్ చెప్పిన మాటలను ఆయన గుర్తుచేశారు. ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఒక వజ్రాయుధమని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.



More Telugu News