గ్లోబల్ సమ్మిట్‌కు అంతర్జాతీయ స్థాయి ఏర్పాట్లు... స్వయంగా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

  • డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
  • హైదరాబాద్‌ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను సమీక్షించిన సీఎం రేవంత్
  • అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం
  • ప్రజా ప్రభుత్వం రెండేళ్ల విజయాలను ప్రదర్శించనున్న సర్కార్
  • సదస్సులో 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ డాక్యుమెంట్ విడుదల
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ సదస్సు వేదికను ఆయన సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. సదస్సు ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని, ఏ లోటూ రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఈ సదస్సుకు వివిధ దేశాల రాయబారులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు హాజరవుతున్నందున, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భద్రతా ఏర్పాట్లు అత్యంత కట్టుదిట్టంగా ఉండాలని, పాసులు లేనివారిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించవద్దని సీఎం సూచించారు. వాహనాల పార్కింగ్ కోసం విశాలమైన ఏర్పాట్లు చేయాలని పోలీసులకు దిశానిర్దేశం చేశారు. భద్రతా సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు కూడా తగిన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సదస్సును ఓ పండుగలా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రభుత్వ విజయాలను ప్రదర్శించేందుకు ఫ్యూచర్ సిటీలో భారీ వేదికను ఏర్పాటు చేయాలన్నారు. సదస్సు మొదటి రోజు (డిసెంబర్ 8న) ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తామని, రెండో రోజు (డిసెంబర్ 9న) తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలతో కూడిన 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తామని తెలిపారు.

ఈ సదస్సు ద్వారా ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ఆ దిశగా ఈ సదస్సు కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు.


More Telugu News