షూటింగ్‌లో శ్రద్ధా కపూర్‌కు ఫ్రాక్చర్.. నిలిచిపోయిన సినిమా

  • ‘ఈతా’ బయోపిక్ షూటింగ్‌లో శ్రద్ధా కపూర్‌కు గాయం
  • డ్యాన్స్ చేస్తుంటే కాలికి ఫ్రాక్చర్ 
  • పాత్ర కోసం 15 కిలోలకు పైగా పెరిగిన శ్రద్ధా
  • రెండు వారాల పాటు నిలిచిపోయిన సినిమా షూటింగ్
బాలీవుడ్ ప్రముఖ నటి శ్రద్ధా కపూర్ షూటింగ్‌లో గాయపడ్డారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఈతా’ బయోపిక్ సెట్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆమె కాలికి ఫ్రాక్చర్ కావడంతో సినిమా చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేశారు.

లక్ష్మణ్ ఉటేకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ నాసిక్‌లో జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మిడ్-డే కథనం ప్రకారం, ఒక లావణి పాటను చిత్రీకరిస్తున్న సమయంలో శ్రద్ధా గాయపడింది. వేగవంతమైన డ్యాన్స్ స్టెప్పులు వేస్తుండగా, ఆమె తన శరీర బరువు మొత్తం ఎడమ కాలిపై వేయడంతో బ్యాలెన్స్ కోల్పోయి కిందపడింది. ఈ పాత్ర కోసం శ్రద్ధా 15 కిలోలకు పైగా బరువు పెరిగిందని, నౌవారీ చీర, బరువైన ఆభరణాలు ధరించి డ్యాన్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని సమాచారం.

ప్రమాదం తర్వాత ముంబైకి తిరిగివచ్చిన శ్రద్ధా కొన్ని ఎమోషనల్ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంది. అయితే నొప్పి ఎక్కువ కావడంతో షూటింగ్‌ను ఆపేశారు. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత, రెండు వారాలకు చిత్రీకరణ తిరిగి ప్రారంభమవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ విషయంపై శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో ఇంకా స్పందించలేదు.

మహారాష్ట్రకు చెందిన ప్రముఖ తమాషా కళాకారిణి, ‘తమాషా సామ్రాజ్ఞి’గా పేరుగాంచిన విఠాబాయి నారాయణగావ్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆమె జానపద నృత్యానికి చేసిన సేవలకు గాను 1957, 1990లలో రాష్ట్రపతి అవార్డులు అందుకున్నారు.


More Telugu News