మరణశిక్షపై తొలిసారిగా స్పందించిన షేక్ హసీనా

  • బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష
  • ఇది పక్షపాతంతో కూడిన రాజకీయ కుట్ర అని విమర్శించిన హసీనా
  • అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో విచారణకు సిద్ధమంటూ సవాల్
బంగ్లాదేశ్ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ఐసీటీ) కాసేపటి క్రితం సంచలన తీర్పు వెలువరించింది. గతేడాది జులైలో జరిగిన ప్రదర్శనల సందర్భంగా మానవతా వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారని నిర్ధారిస్తూ ఈ శిక్ష ఖరారు చేసింది. అయితే, ఈ తీర్పును షేక్ హసీనా తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా పక్షపాతంతో కూడిన, రాజకీయ ప్రేరేపిత తీర్పు అని ఆమె అభివర్ణించారు.

మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'రిగ్డ్ ట్రిబ్యునల్' ఈ తీర్పు ఇచ్చిందని హసీనా ఆరోపించారు. ఈ మేరకు ఐఏఎన్ఎస్ తన కథనంలో వెల్లడించింది. "ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాని ఈ ప్రభుత్వంలోని కొందరు తీవ్రవాదులు, నన్ను, నా పార్టీ అవామీ లీగ్‌ను రాజకీయంగా అంతం చేయాలనే దురుద్దేశంతోనే ఈ కుట్ర పన్నారని" ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూనస్ పాలనలో దేశంలో ప్రజా సేవలు కుప్పకూలాయని, శాంతిభద్రతలు క్షీణించాయని ఆమె విమర్శించారు.

గతేడాది జరిగిన ఆందోళనల్లో ఇరువర్గాల మరణాల పట్ల తాను విచారం వ్యక్తం చేస్తున్నానని, అయితే నిరసనకారులను చంపమని తాను గానీ, తన పార్టీ నేతలు గానీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని హసీనా స్పష్టం చేశారు. తనపై మోపిన ఆరోపణలను సరైన న్యాయస్థానం ముందు ఎదుర్కోవడానికి తాను భయపడనని తెలిపారు. ఈ కేసును హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ముందు విచారణ జరపాలని తాను తాత్కాలిక ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నానని, అక్కడ తాను నిర్దోషిగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఐసీసీ విచారణ జరిపితే తమ మానవ హక్కుల ఉల్లంఘనలు బయటపడతాయనే భయంతోనే తాత్కాలిక ప్రభుత్వం తన సవాల్‌ను స్వీకరించడం లేదని ఆమె ఆరోపించారు.


More Telugu News