: ఆండ్రోమెడాలో అధిక సంఖ్యలో కృష్ణబిలాలు!
సూర్యుడితో కూడిన పాలపుంతకు సోదరుడిలా భావించే ఆండ్రోమెడా గెలాక్సీలో అధిక సంఖ్యలో కృష్ణబిలాలు (బ్లాక్ హోల్స్) ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మన పాలపుంతకు సమీపంలో ఉన్న ఆండ్రోమెడా గెలాక్సీలో ఉన్న కృష్ణ బిలాలను పసిగట్టేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన చంద్ర అబ్జర్వేటరీని శాస్త్రవేత్తలు ఉపయోగించారు. సుమారు 13 ఏళ్ళపాటు ఈ అబ్జర్వేటరీ జరిపిన సుమారు 150 పరిశీలనలను ఉపయోగించి ఆండ్రోమెడా గెలాక్సీలో 26 కొత్త కృష్ణబిలాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. మన పాలపుంత గెలాక్సీకి వెలుపల ఇంతపెద్ద సంఖ్యలో కృష్ణబిలాలను గుర్తించడం ఇదే మొదటిసారి. పాలపుంత గెలాక్సీ, ఆండ్రోమెడా గెలాక్సీలు కొన్ని వందల కోట్ల ఏళ్ల తర్వాత ఢీకొట్టుకుంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఆండ్రోమెడా గెలాక్సీలో కొత్తగా ఇన్ని కృష్ణబిలాలు కనిపించడం తమకు ఎంతో ఉద్వేగాన్ని కలిగిస్తోందని, అయితే తాము కనుగొన్నది కొన్ని మాత్రమేనని, ఇంకా పెద్ద సంఖ్యలో అక్కడ కృష్ణబిలాలు ఉంటాయని హార్వర్డ్-స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన రాబిన్ బర్నార్డ్ చెబుతున్నారు. భారీ నక్షత్రాలు మరణించినపుడు కృష్ణబిలాలు ఏర్పడ్డాయి. సూర్యుడి ద్రవ్యరాశితో పోల్చినపుడు వీటి ద్రవ్యరాశి ఐదు నుండి పది రెట్లు ఎక్కువగా ఉంటుంది.