సీదిరి అప్పలరాజును ఏడు గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు

  • శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో ఘటన
  • గతేడాది సోషల్ మీడియా పోస్టుల కేసులో విచారణ
  • ఉదయం నోటీసులు ఇచ్చి మధ్యాహ్నం స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. నిన్న మధ్యాహ్నం పోలీస్ స్టేషన్‌కు హాజరైన ఆయనను దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించారు. గత ఏడాది ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలకు సంబంధించి ఈ విచారణ జరిగింది.

గత ప్రభుత్వ హయాంలో అప్పలరాజు సామాజిక మాధ్యమాల్లో చేసిన కొన్ని వ్యాఖ్యలపై అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని పోలీసులు నిన్న ఉదయం పలాసలోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. పోలీసుల ఆదేశాల మేరకు అప్పలరాజు మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.

అక్కడ అధికారులు ఆయన్ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. దాదాపు 7 గంటల పాటు విచారణ కొనసాగింది. పాత పోస్టులు, వాటి వెనుక ఉద్దేశాలపై పోలీసులు ఆయన్ను పలు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. విచారణ ముగిసిన అనంతరం, మళ్లీ అవసరమైనప్పుడు పిలుస్తామని, విచారణకు సహకరించాలని చెప్పి అధికారులు ఆయన్ను పంపించారు. ఈ పరిణామం స్థానిక వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 


More Telugu News