: విజయవాడలో బాతు అరెస్ట్


విజయవాడలో ఓ బాతును పోలీసులు అరెస్టు చేశారు. ఏంటీ.. చిత్రంగా అనిపిస్తోందా.. అయినా నమ్మకతప్పదు. ఎందుకంటే బాతు గారి చేష్టలు శ్రుతి మించడంతో అరెస్టుకు పూనుకోక తప్పలేదు. విషయమేంటంటే విజయవాడ సిటీలో సుగలి కాలనీలో ఓ ఐదేళ్ల బాలిక తన ఇంటి వద్ద ఆడుకుంటోందట. ఇది గమనించిన బాతు ఏమనుకుందో ఏమో.. పరుగున వెళ్లి అ చిన్నారిని కసిదీరా తన ముక్కుతో పొడిచేసింది.

దీంతో ఆ బాలిక గావు కేకలు పెట్టడంతో, బైటకు వచ్చిన ఆమె తల్లి బాతు చేసిన నిర్వాకం చూసి నివ్వెరబోయింది. వెంటనే తేరుకొని పాపను ఆస్పత్రిలో చేర్పించి, అట్నుంచటే నున్నా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు చిన్న విషయమేనని తేలిక చేయబోతే ఆధారాలు చూపించి వాళ్లను పరుగులు పెట్టించింది. దీంతో వాళ్లు ఆ బాతు కోసం కాలనీ నాలుగు దిక్కులా గాలించి, నానా తిప్పలు పడి పట్టుకొని అరెస్టు చేశారు. బాతు కోసం ప్రత్యేక సెల్ పోలీస్ స్టేషన్లో ఉండదు కదా! అందుకే ఆ బాతును పక్షి సంరక్షణశాలకు అప్పగించి, జాగ్రత్తలు చెప్పి వచ్చారట. బాతు మాత్రం 'పొడవడానికి ఇక్కడా ఎవరో ఒకరు దొరకకపోరా' అంటూ అక్కడే ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోందట.

  • Loading...

More Telugu News