మోదీ మంచివాడే... కానీ కఠినమైన వ్యక్తి: ట్రంప్

  • దక్షిణ కొరియాలో ట్రంప్ పర్యటన
  • భారత్-పాక్ అంశంపై స్పందన 
  • ప్రధాని మోదీ గురించి ప్రస్తావన
భారత ప్రధాని నరేంద్ర మోదీ చూడటానికి ఎంతో మంచి వ్యక్తిలా కనిపిస్తారని, కానీ ఆయన చాలా కఠినమైన వ్యక్తి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. బుధవారం తన ఆసియా పర్యటనలో భాగంగా దక్షిణ కొరియాలో మాట్లాడిన ఆయన, భారత్‌తో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందంపై త్వరలోనే సంతకాలు చేస్తామని ప్రకటించారు. ఇదే సందర్భంలో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని, అందుకు మోదీ కఠిన వైఖరే కారణమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"భారత్, పాకిస్థాన్‌ల విషయానికొస్తే... నేను భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకుంటున్నాను. నాకు ప్రధాని మోదీపై గొప్ప గౌరవం, ప్రేమ ఉన్నాయి. మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి" అని ట్రంప్ పేర్కొన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు తాను మోదీకి ఫోన్ చేసి, "మీరు పాకిస్థాన్‌తో యుద్ధం ప్రారంభిస్తే మేం మీతో వాణిజ్య ఒప్పందం చేసుకోలేం" అని చెప్పినట్లు ట్రంప్ గుర్తుచేసుకున్నారు. "మోదీ చూడటానికి మంచి వ్యక్తి అయినా, ఆయన చాలా కఠినమైనవారు. యుద్ధం చేసి తీరుతామన్నారు. అయితే నా మాటలు విన్న రెండు రోజులకే మోదీ, షెరీఫ్ నాతో మాట్లాడి యుద్ధాన్ని ఆపేశారు" అని ట్రంప్ వివరించారు.

కొంతకాలంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. భారత్ రష్యా నుంచి చమురు కొనడం, అమెరికా భారత ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు విధించడం వంటి అంశాలు చర్చలకు అడ్డంకిగా మారాయి. అయితే ఇటీవల ట్రంప్, మోదీ ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ఈ వివాదాలు పరిష్కారమైనట్లు తెలుస్తోంది. అమెరికా టారిఫ్‌లను 16 శాతానికి తగ్గించడానికీ, బదులుగా భారత్ రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించుకోవడానికీ అంగీకరించినట్లు సమాచారం.


More Telugu News