ఏపీలో రైల్వే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

  • ఏపీ రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • రాష్ట్రవ్యాప్తంగా రూ.33,630 కోట్ల విలువైన పనులు 
  • నడికుడి-శ్రీకాళహస్తి, గుంటూరు-గుంతకల్ పనుల పురోగతిపై చర్చ
  • అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి, కొత్త లైన్ల ప్రతిపాదనల ప్రస్తావన
  • సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి, రైల్వే ఉన్నతాధికారులు
రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం రూ.33,630 కోట్ల విలువైన రైల్వే పనులు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ఈ కీలక ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

ఈ సమీక్షలో పలు ముఖ్యమైన రైల్వే లైన్ల పనుల పురోగతిపై అధికారులు నివేదిక సమర్పించారు. ముఖ్యంగా నడికుడి-శ్రీకాళహస్తి, గుంటూరు-గుంతకల్ డబ్లింగ్, గుణదల-ముస్తాబాద్ బైపాస్, రాయదుర్గ్-తుముకూరు మధ్య కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులు ఎంతవరకు వచ్చాయో చర్చకు వచ్చింది. వీటితో పాటు, రాష్ట్రంలో కొత్తగా చేపట్టాల్సిన రైల్వే లైన్లు, అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద రైల్వే స్టేషన్ల అభివృద్ధి, రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ), అండర్ బ్రిడ్జి (ఆర్ యూబీ)ల నిర్మాణానికి సంబంధించి రైల్వే శాఖకు పంపిన ప్రతిపాదనలపైనా సమీక్షించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ శ్రీవాస్తవ, తూర్పు, దక్షిణ కోస్తా రైల్వేలకు చెందిన పలువురు కీలక అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ సమన్వయంతో పనిచేయాలని ఈ సమావేశంలో అభిప్రాయపడినట్లు సమాచారం.


More Telugu News