దుబాయ్‌లో ఏపీ రోడ్‌షో సక్సెస్.. సీఎం ప్రజెంటేషన్‌కు స్టాండింగ్ ఓవేషన్

  • దుబాయ్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 
  • సీఐఐ రోడ్‌షోలో పాల్గొని ఏపీలోని అవకాశాలను వివరించిన సీఎం
  • విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన
  • ఆర్సెల్లార్ మిట్టల్ సంస్థ రూ. లక్ష కోట్ల పెట్టుబడి పెడుతోందని వెల్లడి
  • సరైన ప్రతిపాదనలతో వస్తే పరిశ్రమలకు తక్షణమే అనుమతులన్న చంద్ర‌బాబు
  • విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు యూఏఈ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చే లక్ష్యంతో సీఎం చంద్రబాబు దుబాయ్‌లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఐఐ నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని, ఏపీలోని అపార అవకాశాలను యూఏఈ పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు విశేష స్పందన లభించింది. పారిశ్రామికవేత్తలు నిలబడి చప్పట్లతో (స్టాండింగ్ ఓవేషన్) తమ అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. "ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధిలో మైక్రోసాఫ్ట్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు అదే తరహాలో విశాఖపట్నం అభివృద్ధిలో గూగుల్ ప్రధాన పాత్ర పోషించనుంది. గూగుల్ సంస్థ విశాఖలో భారీ ఏఐ డేటా హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. దీంతో విశాఖ భవిష్యత్ సాంకేతికతకు కేంద్రంగా మారనుంది" అని స్పష్టం చేశారు.

అన్ని రంగాల్లోనూ అవకాశాలు
వ్యవసాయం నుంచి టెక్నాలజీ వరకు, గనుల నుంచి అంతరిక్ష సాంకేతికత వరకు, చిప్ తయారీ నుంచి నౌకా నిర్మాణం వరకు రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ముఖ్యమంత్రి విపులంగా వివరించారు. "ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధారిత రాష్ట్రమైనప్పటికీ, అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి బాటలు వేస్తున్నాం. రాయలసీమలో ఉద్యానవన పంటలకు, తీరప్రాంతంలో ఆక్వా కల్చర్‌కు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా పోర్టులు, విమానాశ్రయాలు, రహదారుల వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం" అని ఆయన తెలిపారు.

పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చామని, రాష్ట్రంలో తిరుపతి వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఆర్సెల్లార్ మిట్టల్ సంస్థ రూ. లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందని, అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

తక్షణమే పరిశ్రమలకు ఆమోదం
రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న విశ్వసనీయత వల్లే పెట్టుబడులు వస్తున్నాయని, అమరావతిలో లైబ్రరీ నిర్మాణం కోసం శోభా గ్రూప్ రూ.100 కోట్లు విరాళం ఇవ్వడమే దీనికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు దుబాయ్ పారిశ్రామికవేత్తలను ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించారు. "మీరు సరైన పారిశ్రామిక ప్రతిపాదనలతో వస్తే, అవగాహన ఒప్పందాలతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు తక్షణమే ఆమోదం తెలుపుతాం. ముందుగా ఏపీకి రండి, ఇక్కడి ప్రభుత్వ విధానాలను, అవకాశాలను పరిశీలించండి, ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి" అని వారికి భరోసా ఇచ్చారు.



More Telugu News