: టీమిండియా 'రాక్ స్టార్' కన్ఫ్యూజయ్యాడట!


భారత జట్టులో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నవి రెండే పేర్లు. ఒకటి.. బ్యాటింగ్ సెన్సేషన్ శిఖర్ ధావన్ ది అయితే.. రెండోది లెఫ్టార్మ్ బౌలింగ్ సంచలనం రవీంద్ర జడేజాది. బ్యాట్స్ మన్ గా జట్టులోకొచ్చి బౌలర్ గా పాతుకుపోవడం జడేజాకే చెల్లింది. కెప్టెన్ తనపై నమ్మకముంచి బంతినిచ్చినప్పుడల్లా వికెట్ తీసి ఆ విశ్వాసాన్ని నిలుపుకోవడం ఈ సౌరాష్ట్ర కుర్రాడి నైజం. జట్టులో అందరూ ముద్దుగా 'రాక్ స్టార్' అని పిలుచుకునే జడేజా.. 2011 వరల్డ్ కప్ అనంతరం కెరీర్ ఒడిదుడుకులకు లోనైనప్పుడు బ్యాట్స్ మన్ గా కొనసాగాలో.. బౌలర్ గా ఎదగాలో నిర్ణయించుకోలేక తీవ్రంగా సతమతమయ్యాడట. ఈ విషయాన్ని సౌరాష్ట్ర రంజీ కోచ్ దేబు మిత్రా చెప్పారు.

తన శిష్యుడు ఇప్పుడు టీమిండియాలో కీలక సభ్యుడిగా ఎదగడం పట్ల ఈ కోచ్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. జడేజాకు ఈ స్థానం ఆయాచితంగా లభించలేదని అన్నాడీ క్రికెట్ గురువు. అయితే, జడేజా ఈ స్థాయికి చేరే క్రమంలో ఎన్నోఆటుపోట్లను ఎదుర్కొన్నాడని, రెండేళ్ళ క్రితం బ్యాట్ ను ఎంచుకోవాలో, బంతిని నమ్ముకోవాలో తెలీక గందరగోళానికి గురయ్యాడని గుర్తు చేసుకున్నాడు. అయితే, భారత జట్టు అప్పటికే దిగ్గజ బ్యాట్స్ మెన్ తో అలరారుతుండగా.. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ తోనే జట్టులో స్థానం సంపాదించుకోగలవని జడేజాకు సలహా ఇచ్చినట్టు మిత్రా వెల్లడించాడు.

తన సూచనను మన్నించిన జడేజా ఆ సీజన్ లో 43 వికెట్లు తీసి సత్తా చాటాడని ఈ సౌరాష్ట్ర కోచ్ తెలిపారు. జడేజా ఎంత శ్రమిస్తాడో చెబుతూ.. నెట్స్ వద్దకు అందరి కంటే మొదట వచ్చి.. అందరి కంటే చివర వెళతాడని.. చెమటోడ్చటమే అతని తత్వం అని వివరించాడు.

  • Loading...

More Telugu News