నైరుతికి వీడ్కోలు, ఈశాన్యానికి స్వాగతం.. ఏపీకి భారీ వర్ష సూచన

  • దేశం నుంచి పూర్తిగా వైదొలగిన నైరుతి రుతుపవనాలు
  • ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల్లోకి ప్రవేశించిన ఈశాన్యం
  • దక్షిణ కోస్తా, రాయలసీమకు రెండు రోజుల పాటు వర్ష సూచన
  • ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
  • అరేబియా, బంగాళాఖాతంలో వేర్వేరుగా వాయుగుండాలు
రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు గురువారం పూర్తిగా నిష్క్రమించగా, అదే సమయంలో ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల్లోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ మార్పు ప్రభావంతో రాబోయే రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వాతావరణ శాఖ సూచనల ప్రకారం, రానున్న 48 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని పేర్కొంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు.

ఇదిలా ఉండగా, రాబోయే వారంలో రెండు సముద్రాల్లో వాతావరణం అల్లకల్లోలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడి, 22వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది అక్టోబర్ 26 నాటికి తుపాన్‌గా మారవచ్చని అంతర్జాతీయ వాతావరణ నమూనాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు, బంగాళాఖాతంలోనూ ఈ నెల 21 తర్వాత అల్పపీడనం ఏర్పడి, 26 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిపై పూర్తి స్పష్టత రావడానికి మరికొన్ని రోజులు పడుతుందని అధికారులు తెలిపారు.

తిరుమలలో భారీ వర్షం 
కాగా, ఇప్పటికే రాష్ట్రంలో వాతావరణ మార్పుల ప్రభావం కనిపిస్తోంది. బుధవారం తిరుమలలో భారీ వర్షం కురిసింది. తెల్లవారుజామున మొదలైన వర్షం సుమారు గంటపాటు కుండపోతగా కురవడంతో మాడవీధులు, పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం అనంతరం కొండపై చలి తీవ్రత పెరగడంతో పాటు, దట్టమైన పొగమంచు అలముకుంది.


More Telugu News