దేశంలో తగ్గుతున్న జననాలు.. ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు

  • 2023లో 2 లక్షలకు పైగా తగ్గిన జననాల నమోదు
  • స్వల్పంగా పెరిగిన మరణాల సంఖ్య
  • గత ఐదేళ్లలో జననాలు తగ్గడం ఇది మూడోసారి
  • ఆసుపత్రుల్లో తగ్గుముఖం పట్టిన ప్రసవాల శాతం
  • వైద్య సహాయం అందక పెరుగుతున్న మరణాలు
  • కేంద్ర హోంశాఖ సీఆర్‌ఎస్‌ 2023 నివేదిక వెల్లడి
దేశంలో జననాల నమోదు గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. 2022 సంవత్సరంతో పోలిస్తే 2023లో రెండు లక్షలకు పైగా జననాలు తక్కువగా నమోదయ్యాయి. గత ఐదేళ్ల కాలంలో జననాల నమోదు తగ్గడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇదే సమయంలో మరణాల నమోదులో స్వల్ప పెరుగుదల కనిపించింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్‌జీఐ) విడుదల చేసిన 'సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్‌ఎస్) 2023' నివేదికలో ఈ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ నివేదిక ప్రకారం 2023లో దేశవ్యాప్తంగా 2.52 కోట్ల జననాలు నమోదయ్యాయి. ఇది 2022లో నమోదైన జననాలతో పోలిస్తే 2,32,094 (0.9 శాతం) తక్కువ. దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతోందనడానికి ఇది ఒక సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు, 2023లో మొత్తం 87 లక్షల మరణాలు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే ఇది కేవలం 9,749 (0.1 శాతం) మాత్రమే ఎక్కువ కావడంతో, మరణాల సంఖ్య దాదాపు స్థిరంగా ఉన్నట్లేనని నివేదిక స్పష్టం చేసింది.

ఈ నివేదికలో మరికొన్ని ఆందోళనకరమైన అంశాలు కూడా ఉన్నాయి. దేశంలో ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో జరిగే ప్రసవాల శాతం క్రమంగా తగ్గుతోంది. 2022లో ఇది 75.5 శాతంగా ఉండగా, 2023 నాటికి 74.7 శాతానికి పడిపోయింది. కరోనా మహమ్మారికి ముందు ఇది 80 శాతానికి పైగా ఉండేది.

అలాగే, సరైన సమయంలో వైద్య సహాయం అందక ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 2022లో ఇలాంటి మరణాలు 50.7 శాతంగా నమోదు కాగా, 2023లో ఆ సంఖ్య 53.4 శాతానికి పెరిగింది. కరోనాకు ముందు ఈ తరహా మరణాలు 40 శాతం లోపే ఉండటం గమనార్హం. ఈ గణాంకాలు దేశ ఆరోగ్య వ్యవస్థ పనితీరుపై కొత్త చర్చకు దారితీస్తున్నాయి.


More Telugu News