నాన్న సూసైడ్ కి నేను కారణం కాదు: రంగనాథ్ తనయుడు నాగేంద్ర!

  • రంగనాథ్ గురించి ప్రస్తావించిన తనయుడు 
  • తండ్రి చాలా సెన్సిటివ్ అని వ్యాఖ్య 
  • తన విషయాలు షేర్ చేసుకోరని వెల్లడి   
  • పలు కారణాలతో దూరంగా ఉన్నానని వివరణ  
  • తనని అపార్థం చేసుకోవడానికి ఇదే కారణమన్న నాగేంద్ర 

తెలుగు తెరకి ఒక నిండుదనాన్ని తీసుకొచ్చిన నటులలో రంగనాథ్ ఒకరు. గంభీరమైన రూపం .. వాయిస్ ఆయన సొంతం. వందలాది  సినిమాలో నటించిన రంగనాథ్, ఆ మధ్య సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఆ సంఘటన ఆయన అభిమానులను కదిలించి వేసింది. ఆయన తనయుడు నాగేంద్ర కుమార్ తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"మా నాన్నగారు చాలా గంభీరంగా .. హుందాగా కనిపించేవారు .. కానీ నిజానికి ఆయన చాలా సెన్సిటివ్. దగ్గర బంధువులంతా మా ఇంట్లోనే ఉండేవారు. వాళ్లను పోషించే బాధ్యత తనపై ఉండటం వలన, హీరో ఛాన్సులు మాత్రమే చేస్తానని వెయిట్ చేయలేకపోయారు. అమ్మకి ప్రమాదం జరిగిన తరువాత మంచంలోనే ఉండేది. ఫ్యామిలీని చూసుకోవడానికి అవసరమైన డబ్బు కోసమే  నేను 'దుబాయ్' వెళ్లాను. అమ్మకి నేను కూడా సేవలు చేశాను .. అందుకు అవసరమైన డబ్బు కోసమే దుబాయ్ వెళ్లానని నాన్న బయటివాళ్లకి చెప్పకపోవడం వలన, అందరూ నన్ను అపార్థం చేసుకున్నారు" అని అన్నారు. 

"మా అమ్మను మా నాన్నగారు ఒక్కరే చూసుకోలేకపోతున్నారని నేను పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయి చాలా మంచిది. కాకపోతే అంత కలుపుగోలు మనిషి కాదు. అందువలన మనస్పర్థలు వచ్చాయి. ఆ కారణంగా మేము వేరే వెళ్లిపోవలసి వచ్చింది. తన సంపాదన - ఖర్చు గురించి అడగడం నాన్నకి ఇష్టం ఉండేది కాదు. అందువలన నేను ఎప్పుడూ అడగలేదు. దాంతో తండ్రిని పట్టించుకోలేదనే ప్రచారం జరిగింది. ఆయనను అభిమానించే వాళ్లంతా ఇప్పటికీ నాపై కోపంతోనే ఉన్నారు. కానీ నిజానికి నేను నా ఫ్యామిలీని ఎప్పుడూ నిర్లక్ష్యం చేసింది లేదు" అని చెప్పారు.    



More Telugu News