ఢిల్లీ మెట్రోలో రెజ్లింగ్ ఫైట్... సీటు కోసం చితక్కొట్టుకున్న ప్రయాణికులు!

  • సీటు కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన వాగ్వాదం
  • మాటల యుద్ధం కాస్తా ముదిరి పిడిగుద్దుల దాడి
  • రెజ్లింగ్‌ను తలపించిన ప్రయాణికుల ఫైటింగ్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఘటన వీడియో
వివాదాలు, వింత ఘటనలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న ఢిల్లీ మెట్రోలో తాజాగా మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈసారి ఇద్దరు ప్రయాణికులు ఏకంగా రెజ్లర్ల తరహాలో ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అస‌లేం జ‌రిగిందంటే..!
ఢిల్లీ మెట్రో కోచ్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య సీటు విషయంలో చిన్నపాటి వాగ్వాదం మొదలైంది. కొద్దిసేపటికే మాటామాటా పెరిగి పరిస్థితి చేయిదాటింది. ఒకరినొకరు దూషించుకుంటూ తోపులాటకు దిగారు. అది కాస్తా ముదిరి ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకు వెళ్లింది. ఇద్దరూ రెజ్లింగ్‌ను తలపించేలా తన్నుకుంటూ, పంచ్‌లు విసురుకున్నారు.

ఈ అనూహ్య పరిణామంతో రైలులోని తోటి ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఏం జరుగుతుందో తెలియక కొద్దిసేపు నిశ్చేష్టంగా ఉండిపోయారు. అనంతరం కొందరు చొరవ తీసుకుని గొడవ పడుతున్న ఇద్దరినీ విడదీసి శాంతింపజేశారు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు తన ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది.

ఇటీవల కాలంలో అసభ్యకర చేష్టలు, డ్యాన్స్ రీల్స్, ముద్దుల వంటి ఘటనలతో ఢిల్లీ మెట్రో తరచూ విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ ఘర్షణ వీడియో ఆ జాబితాలో చేరింది. ప్రయాణికుల భద్రత, మెట్రో నిబంధనల అమలుపై మరోసారి చర్చ మొదలైంది.


More Telugu News