రేవంత్ రెడ్డిపై ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు.. వీడియో విడుదల చేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి

  • ప్రశాంత్ కిషోర్ తానే గొప్పవాడిననే భ్రమలో జీవిస్తున్నారని వ్యాఖ్య
  • ఆయన కొన్ని రాష్ట్రాలలో ఫెయిల్ అయిన నాయకుడు అని చురక
  • పక్క రాష్ట్రాల గురించి కాకుండా బీహార్ గురించి ఆలోచించాలని హితవు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. ప్రశాంత్ కిశోర్ ఇతర రాజకీయ నాయకులపై విమర్శలు చేస్తూ తానే గొప్పవాడిననే భ్రమలో జీవిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రశాంత్ కిశోర్ కొన్ని రాష్ట్రాలలో ఫెయిల్ అయిన రాజకీయ నాయకుడని విమర్శించారు.

ఇప్పుడు జన్ సురాజ్ పార్టీ పేరుతో బీహార్ ప్రజలను ఆకర్షించాలనుకుంటున్నప్పటికీ, ఆయన సిద్ధాంతాలు అక్కడ పనిచేయడం లేదని అన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు రేవంత్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీహార్ ఎన్నికల కోసం మాత్రమే ఇలా చేస్తూ ప్రతి ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి పేరును ఉపయోగించడం సరికాదని అన్నారు.

బీహార్‌లో వలసలు తగ్గించడంపై దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రశాంత్ కిశోర్ పక్క రాష్ట్రాల గురించి కాకుండా బీహార్ గురించి ఆలోచించాలని సూచించారు. బీహార్ అభివృద్ధి కోసం ప్రణాళికలు చెప్పకుండా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను విమర్శించడమేమిటని ప్రశ్నించారు. రాజకీయాలు చేయాలనుకుంటే బీహార్‌కు ఏం చేస్తారో చెప్పాలని సూచించారు.

బీహార్ ప్రజలను తక్కువ చేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి తమ గడ్డపై అడుగుపెడితే తగిన గుణపాఠం చెబుతామని ఇటీవల ప్రశాంత్ కిశోర్ హెచ్చరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి రేవంత్ రెడ్డిని ఓడిస్తానని శపథం చేశారు. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ కూడా కాపాడలేరని అన్నారు. ఈ వ్యాఖ్యలపై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.


More Telugu News