: ధావన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాలనుకున్నాడా?
చాంపియన్స్ ట్రోఫీలో వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్న ఢిల్లీ డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్ శిఖర్ ధావన్ ఓ దశలో క్రికెట్ కు గుడ్ బై చెప్పాలనుకున్నాడా? అంటే, అవుననే అంటున్నాడు ధావన్ కోచ్ తారక్ సిన్హా. టీమిండియాలో చోటు కోసం ఎన్నో విఫలయత్నాలు చేసిన పిదప, ధావన్ తీవ్ర నిరాశానిస్పృహలకు లోనయ్యాడని తారక్ చెప్పారు. ఢిల్లీ జట్టులో తనకంటే జూనియర్ అయిన విరాట్ కోహ్లీకి భారత జట్టు ఆహ్వానం లభించడం పట్ల ధావన్ దిగ్భ్రాంతి చెందాడని, ఆ సమయంలోనే ఆట నుంచి తప్పుకుందామని యోచించాడని ఆయన గుర్తు చేసుకున్నారు.
అయితే, తాను ధావన్ లో పేరుకున్న నైరాశ్యాన్ని తొలగించి, అతడిని కర్తవ్యోన్ముఖుణ్ణి చేశానని తారక్ వెల్లడించారు. 'నాకేం తక్కువ, ఎందుకని జట్టులో స్థానం దక్కడంలేదు?' అని ధావన్ ప్రశ్నించేవాడని, అందుకు తాను, 'నీ శ్రమ వృథా పోదు' అని ఆత్మవిశ్వాసం నూరిపోసేవాణ్ణని ఆయన తెలిపారు.