కరూర్ లో పర్యటించనున్న ఎన్డీయే ప్రతినిధి బృందం... కమిటీలో టీడీపీ ఎంపీకి చోటు

  • విజయ్ సభ తొక్కిసలాట ఘటనపై ఎన్డీయే దృష్టి
  • నిజ నిర్ధారణ కోసం 8 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు
  • ఎంపీ హేమమాలిని నేతృత్వంలో కరూర్ పర్యటన
  • కమిటీలో టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ కు స్థానం
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కమిటీ ప్రకటన
  • విచారణ బృందంలో శివసేన, బీజేపీ ఎంపీలు కూడా
తమిళనాడులోని కరూర్ లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ర్యాలీలో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనపై ఎన్డీయే దృష్టి సారించింది. ఈ దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులు, వాస్తవాలను వెలికితీసేందుకు 8 మంది ఎంపీలతో కూడిన ఉన్నతస్థాయి నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని నాయకత్వం వహించనున్నారు.

ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం ఈ కమిటీని ప్రకటించారు. ఈ బృందంలో మిత్రపక్షాలైన టీడీపీ, శివసేన పార్టీల ఎంపీలకు కూడా స్థానం కల్పించారు. టీడీపీ తరఫున ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్, శివసేన నుంచి శ్రీకాంత్ షిండే సభ్యులుగా వ్యవహరించనున్నారు. వీరితో పాటు కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్, తేజస్వి సూర్య, బ్రిజ్ లాల్, అపరాజిత సారంగి, రేఖా శర్మ వంటి బీజేపీకి చెందిన సీనియర్ ఎంపీలు కూడా ఈ కమిటీలో ఉన్నారు.

ఇటీవల కరూర్ లో జరిగిన విజయ్ సభకు భారీగా జనం తరలిరావడంతో తొక్కిసలాట జరిగి, సుమారు 40 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో, ఎన్డీయే ఏర్పాటు చేసిన ఈ బృందం త్వరలోనే కరూర్ లో పర్యటించనుంది. క్షేత్రస్థాయిలో పర్యటించి, బాధితులు, స్థానిక అధికారులతో మాట్లాడి సమగ్ర వివరాలు సేకరించి, కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందజేయనుంది.


More Telugu News