మేఘాలను తాకుతూ ప్రయాణం.. చైనాలో అందుబాటులోకి వచ్చిన ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జి!

  • చైనాలో ప్రారంభమైన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హువాజియాంగ్ గ్రాండ్ కెన్యన్ బ్రిడ్జి
  • గైజౌ ప్రావిన్స్‌లో 625 మీటర్ల ఎత్తులో నిర్మాణం
  • రెండు గంటల ప్రయాణ సమయం కేవలం రెండు నిమిషాలకు తగ్గింపు
  • పర్యాటక ఆకర్షణగా మారిన వంతెన.. స్కై కేఫ్‌లు, వ్యూ పాయింట్లు ఏర్పాటు
  • మూడేళ్లకు పైగా సాగిన నిర్మాణ పనులు.. రెండు ప్రపంచ రికార్డులు కైవసం
రెండు గంటల పాటు సాగే కష్టతరమైన ప్రయాణాన్ని కేవలం రెండు నిమిషాలకు కుదించడం సాధ్యమేనా? చైనా దీన్ని సుసాధ్యం చేసి చూపించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనను నిర్మించి రికార్డు సృష్టించింది. గైజౌ ప్రావిన్స్‌లోని హువాజియాంగ్ గ్రాండ్ కెన్యన్ మీదుగా నిర్మించిన ఈ భారీ వంతెనను ఆదివారం అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోయింది.

లోతైన లోయకు 625 మీటర్ల (2,050 అడుగులు) ఎత్తులో నిర్మించిన ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా గుర్తింపు పొందింది. బీపన్ నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి పొడవు సుమారు 2,900 మీటర్లు. మూడేళ్లకు పైగా శ్రమించి, ఇంజినీరింగ్ అద్భుతంగా నిలిచే ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన దృశ్యాల్లో... వాహనాలు మేఘాలను తాకుతూ వెళుతున్నాయా అన్నట్టుగా కనిపించాయి.

ఈ వంతెనను ప్రారంభించడానికి ముందు దాని పటిష్టతను క్షుణ్ణంగా పరీక్షించారు. గత నెలలో 96 భారీ ట్రక్కులను ఏకకాలంలో వంతెనపైకి పంపి లోడ్ టెస్టింగ్ నిర్వహించారు. 400 సెన్సార్ల ద్వారా బ్రిడ్జి సామర్థ్యాన్ని, భద్రతను అంచనా వేసి, సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాతే రాకపోకలకు అనుమతించారు. ఈ వంతెన ప్రపంచంలో అత్యంత ఎత్తైనది కావడమే కాకుండా, పర్వత ప్రాంతంలో నిర్మించిన అతిపెద్ద స్పాన్ వంతెనగా కూడా మరో రికార్డును నెలకొల్పింది.

కేవలం రవాణా కోసమే కాకుండా, ఈ వంతెనను ఒక పర్యాటక ఆకర్షణగా కూడా తీర్చిదిద్దారు. పర్యాటకుల కోసం ప్రత్యేకంగా 207 మీటర్ల ఎత్తైన సైట్‌సీయింగ్ ఎలివేటర్, స్కై కేఫ్‌లు, వ్యూయింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి లోయ అందాలను వీక్షించడం ఓ అద్భుతమైన అనుభూతినిస్తుందని అధికారులు తెలిపారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పది వంతెనల్లో ఎనిమిది చైనాలోనే ఉండటం గమనార్హం. 


More Telugu News