ఆస్ట్రేలియాపై వైభవ్ విధ్వంసం.. సిక్సర్లతో ప్రపంచ రికార్డు!

  • యూత్ వన్డేలలో అత్యధిక సిక్సర్ల ప్రపంచ రికార్డు
  • ఉన్ముక్త్ చంద్ రికార్డును అధిగమించిన వైభవ్ సూర్యవంశీ
  • కేవలం 10 ఇన్నింగ్స్‌లలోనే ఈ అరుదైన ఘనత
  • ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 68 బంతుల్లో 70 పరుగులు
భారత యువ క్రికెట్ సంచలనం, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. యూత్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా సరికొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో బ్రిస్బేన్‌లోని ఇయాన్ హీలీ ఓవల్ మైదానంలో జరిగిన రెండో యూత్ వన్డేలో ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.

ఈ క్రమంలో భారత మాజీ అండర్-19 కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ పేరిట ఉన్న 38 సిక్సర్ల రికార్డును వైభవ్ బద్దలుకొట్టాడు. అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. ఉన్ముక్త్ చంద్ 21 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా, వైభవ్ కేవలం 10 ఇన్నింగ్స్‌లలోనే దానిని అధిగమించి సత్తా చాటాడు.

ఈ మ్యాచ్‌లో ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన వైభవ్, పవర్‌ప్లే ముగిసిన తర్వాత విశ్వ‌రూపాన్ని ప్రదర్శించాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మొత్తం 68 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్ట్ హ్యాండర్, 6 భారీ సిక్సర్లు, 5 ఫోర్ల సహాయంతో 70 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియా గడ్డపై యూత్ వన్డేలలో తన తొలి అర్ధ సెంచరీని కూడా ఇదే మ్యాచ్‌లో నమోదు చేసుకున్నాడు. భారీ షాట్ ఆడే క్ర‌మంలో చివరకు ఔటయ్యాడు.

వైభవ్‌తో పాటు అభిగ్యాన్ కుండు (71), యశ్ దేశ్‌ముఖ్ (70) కూడా రాణించడంతో భారత అండర్-19 జట్టు 49.4 ఓవర్లలో 300 పరుగుల భారీ స్కోరు సాధించింది.


More Telugu News