: సభాపతిపై 'చంద్ర' నిప్పులు


శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పై తెలుగుదేశం పార్టీ నేతలు నిప్పులు చెరిగారు. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, స్పీకర్ నిరంకుశంగా ప్రవర్తించడం సరికాదని హితవు పలికారు. సభలోకి మీడియాను అనుమతించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. సభను జైలులా మార్చారని, తాము బందీల్లా ఉన్నామని బాబు విమర్శించారు. ఈ క్రమంలో టీడీపీ.. నేటి ఫ్లోర్ లీడర్ల సమావేశానికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించింది.

స్పీకర్ మనోహర్ తో మిగతా పార్టీల నేతలు భేటీ అయినా.. టీడీపీ మాత్రం హాజరుకాలేదు. ఈ వ్యవహారంలో బాబును వివరణ కోరేందుకు ప్రభుత్వ ఛీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు.. చంద్రబాబు చాంబర్ కు వెళ్ళినా.. ఫలితం దక్కలేదు. బాబు వారిని కలిసేందుకు నిరాకరించి తమ వైఖరిని సుస్పష్టం చేశారు.

నిన్న జరిగిన సభా సమావేశాల్లో ఓ మంత్రి.. టీడీపీ నేతల పట్ల ఆగ్రహంతో ఊగిపోతే.. స్పీకర్ ఆ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకున్నారని బాబు ఆరోపించారు. అంతేగాకుండా, రికార్డుల్లోంచి తొలగిస్తున్నామంటూ ఓ ప్రకటన చేసి చేతులు దులిపేసుకున్నారని విమర్శించారు. సదరు మంత్రిని గట్టిగా మందలించి ఉంటే బాగుండేదని బాబు అభిప్రాయపడ్డారు. కాగా, ఈ ధోరణిపై టీడీపీ నేతలు స్పీకర్ కు లేఖాస్త్రం సంధించారు. గత మూడేళ్ళుగా తమ పట్ల ఆయన అనుసరిస్తున్న అభ్యంతరకర తీరును నిరసిస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News