రేపు పాక్‌తో మ్యాచ్... పేరు చెప్పకుండానే వేడి పెంచిన కెప్టెన్ సూర్యకుమార్!

  • ఆసియా కప్ 2025లో భారత జట్టు జైత్రయాత్ర
  • గ్రూప్ స్టేజ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ టీమిండియా విజయం
  • సూపర్ ఫోర్‌లో రేపు మరోసారి పాకిస్థాన్‌తో కీలక పోరు
  • పాక్‌తో మ్యాచ్ గురించి అడగ్గా పేరు ఎత్తకుండా సమాధానమిచ్చిన సూర్య
ఆసియా కప్ 2025లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్ స్టేజ్‌లో భాగంగా ఒమన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్-ఏలో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ గెలిచి అప్రతిహతంగా సూపర్ ఫోర్ దశకు చేరుకుంది. అయితే, మ్యాచ్ ఫలితం కంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సందర్భంగా కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్, "ఆదివారం పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నారా?" అని సూర్యకుమార్‌ను ప్రశ్నించాడు. దీనికి సూర్య ఎంతో తెలివిగా పాకిస్థాన్ పేరు ప్రస్తావించకుండా, "మేం సూపర్ ఫోర్స్‌కు సిద్ధంగా ఉన్నాం" అని సమాధానమిచ్చాడు. ఇప్పటికే గ్రూప్ స్టేజ్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్స్ విషయంలో వివాదం నడుస్తున్న నేపథ్యంలో సూర్య వ్యాఖ్యలు దాయాదుల పోరుకు మరింత ఆసక్తిని పెంచాయి.

సూర్య‌ ఎందుకు బ్యాటింగ్‌కు రాలేదంటే?
కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌ నిన్న‌టి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు రాక‌పోవ‌డం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో అతనికి ఏమైనా గాయమైందేమోనని అభిమానులు ఆందోళన చెందారు. అయితే, అలాంటిదేమీ లేదని ఫీల్డింగ్ సమయంలో తేలిపోయింది. టోర్నమెంట్‌లో ఇప్పటివరకు సరిగా ఆడే అవకాశం రాని ఇతర బ్యాటర్లకు క్రీజులో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఇవ్వాలనే వ్యూహంలో భాగంగానే సూర్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమైంది.

అనంతరం ఒమన్ ఆటతీరుపై సూర్యకుమార్ ప్రశంసల వర్షం కురిపించాడు. "ఒమన్ అద్భుతమైన క్రికెట్ ఆడింది. వారి కోచ్ సులక్షణ్ కులకర్ణి నాకు తెలుసు. ఆయన శిక్షణలో జట్టు అద్భుతంగా రాణిస్తుందని ఊహించాను. వారి బ్యాటింగ్ చూడటానికి చాలా బాగుంది" అని అన్నాడు. 

ఇక తన బ్యాటింగ్ ఆర్డర్ గురించి సరదాగా మాట్లాడుతూ, "తర్వాతి మ్యాచ్ నుంచి కచ్చితంగా ముందు బ్యాటింగ్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తా" అని నవ్వేశాడు. ఆదివారం జరగనున్న సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భారత్ మరోసారి పాకిస్థాన్‌తో తలపడనుంది.


More Telugu News