ముందు ఆట‌పై దృష్టి పెట్టండి.. పాక్‌కు కపిల్‌దేవ్ చుర‌క‌

  • పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి భారత క్రికెటర్ల నిరాకరణ
  • వివాదంపై స్పందించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్
  • అది పూర్తిగా వ్యక్తిగత విషయం, పెద్దది చేయొద్ద‌న్న మాజీ క్రికెట‌ర్‌
  • క్రికెట్ ఆడటంపై దృష్టి పెట్టండంటూ సెటైర్‌
  • ఈసారి ఆసియా కప్ టీమిండియాదేనని కపిల్ ధీమా
ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడంపై చెలరేగిన వివాదంపై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. ఇలాంటి చిన్న విషయాలను పెద్దవి చేయాల్సిన అవసరం లేదని, ఆటపైనే దృష్టి పెట్టాలని చుర‌క‌లంటించాడు. షేక్ హ్యాండ్ ఇవ్వాలా? వద్దా? అనేది ఆటగాళ్ల వ్యక్తిగత ఇష్టానికి సంబంధించిన విషయమని స్పష్టం చేశాడు.

ఏఎన్ఐ వార్తా సంస్థతో కపిల్ మాట్లాడుతూ.. "ఇవన్నీ చాలా చిన్న విషయాలు. ఎవరైనా కరచాలనం చేయకూడదనుకుంటే, దానిని రెండు వైపులా పెద్ద సమస్యగా మార్చాల్సిన అవసరం లేదు. ఆటపైనే మన దృష్టి ఉండాలి" అని కపిల్ అన్నారు. కొన్నిసార్లు క్రికెటర్లు చేసే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతుంటాయని, అది సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ జట్టు సరిగా ఆడలేదని, వారు తమ ఆటను మెరుగుపరుచుకోవాలని సూచించారు.

గత ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విష‌యం తెలిసిందే. మ్యాచ్ ముగిశాక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే.. పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయకుండా మైదానం వీడారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన తొలి మ్యాచ్ ఇదే కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ విజయాన్ని భారత సాయుధ బలగాలకు అంకితం ఇస్తున్నట్లు సూర్యకుమార్ ప్రకటించాడు.

టీమిండియా ప్రదర్శనపై కపిల్ దేవ్ ప్రశంసలు కురిపించాడు. "గత 20 ఏళ్లుగా భారత జట్టు అద్భుతంగా ఆడుతోంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్లలో ఎంతో నిలకడగా రాణిస్తోంది. మన క్రికెట్ వ్యవస్థ చాలా పటిష్ఠంగా ఉంది. ఈసారి ఆసియా కప్ 2025 టీమిండియానే గెలుస్తుంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ టోర్నీలో భాగంగా భారత్ ఇప్పటికే యూఏఈ, పాకిస్థాన్‌లపై విజయాలు సాధించి మంచి ఊపు మీదుంది. ఇవాళ దుబాయ్‌లో ఒమన్‌తో తన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడనుంది.


More Telugu News