లాయర్ అయి ఉండి అలా మాట్లాడతారా?: జేసీ సూటి ప్రశ్న

  • వైసీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు
  • కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్‌పై ప్రశ్నలు
  • పోలీసుల భద్రత ఖర్చు పెద్దారెడ్డి చెల్లించారా అని నిలదీత
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించిన సుప్రీంకోర్టు ఆదేశాల విషయంలో, ఒక న్యాయవాది అయి ఉండి వాస్తవాలు తెలుసుకోకుండా ఎలా మాట్లాడతారని ఆయన సూటిగా ప్రశ్నించారు.

కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చినప్పుడు పోలీసు భద్రతకు అయ్యే ఖర్చును తామే భరిస్తామని ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపిన విషయాన్ని జేసీ గుర్తుచేశారు. ఆ హామీ మేరకు పెద్దారెడ్డి పోలీసులకు డబ్బులు చెల్లించారా లేదా అనే విషయాన్ని అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ఏముందో ఒకసారి పూర్తిగా చదివి చూడాలని వెంకట్రామిరెడ్డికి హితవు పలికారు.

"చదువురాని వాళ్లు మాట్లాడితే ఒక అర్థం ఉంది. కానీ, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా ఉన్న అనంత వెంకట్రామిరెడ్డి అన్ని తెలిసి మాట్లాడితే ఎలా?" అని జేసీ నిలదీశారు. కేతిరెడ్డి తాడిపత్రికి వచ్చిన సమయంలో తాము ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. తమకు చట్టంపై పూర్తి గౌరవం ఉందని, న్యాయస్థానం చెప్పిన దానిని పాటించాలని తాము కోరుతున్నామని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. 


More Telugu News