'మిరాయ్'లో దుమ్మురేపేసిన లేడీ ఫైటర్ ఎవరో తెలుసా?

  • ఈ నెల 12న విడుదలైన 'మిరాయ్'
  • 100 కోట్ల దిశగా పరుగులు తీస్తున్న సినిమా 
  • హైలైట్ గా నిలిచిన యాక్షన్ ఎపిసోడ్స్ 
  • యూకా పాత్రలో మెప్పించిన 'తాంజ కెల్లర్'
  • హాలీవుడ్ నటిగా అనుభవం      

'మిరాయ్' .. ఇప్పుడు ఈ సినిమానే థియేటర్లను దడదడలాడిస్తూ దూసుకుపోతోంది. ఈ నెల 12వ తేదీన విడుదలైన ఈ సినిమా 100 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, తేజ సజ్జా కథానాయకుడిగా నటించగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో జగపతిబాబు .. శ్రియ .. రితిక నాయక్ .. మంచు మనోజ్ నటించారు. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు పెద్దల నుంచి పిల్లల వరకూ ఆకట్టుకుంటూ ఉండటం విశేషం. 

ఈ సినిమాలో హీరోకి విలన్ కి మధ్య సాగే యాక్షన్ సన్నివేశాలు, అలాగే హీరోకి 'సంపాతి' పక్షికి మధ్య జరిగే సన్నివేశాలు .. 'మిరాయ్' ఆయుధాన్ని హీరో దక్కించుకునే దృశ్యాలు పేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తయితే, మరో వైపు నుంచి ఆడియన్స్ ను ఆకట్టుకున్న అంశం ఒకటుంది .. అదే 'యూకా' పాత్రను పోషించిన యాక్షన్ లేడీ ఎపిసోడ్. 'టిబెట్' నుంచి హీరోను వెతుక్కుంటూ వచ్చే పాత్ర ఇది. హీరోతో ఆమె చేసిన పోరాట దృశ్యాలు ఈ సినిమాకి మరో హైలైట్ గా నిలిచాయి. 

అత్యాధునిక ఆయుధాలతో హీరోపై మెరుపు వేగంతో ఆమె విరుకుపడే దృశ్యాలను చూసి ప్రేక్షకులు టెన్షన్ పడిపోతారు. ఆమె కాంబినేషన్ లో డిజైన్ చేసిన ప్రతి యాక్షన్ సీన్ పెర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. ఆమె నిజంగానే ఫైటర్ అయ్యుంటుందనే అనుమానం కూడా ఆడియన్స్ కి కలుగుతుంది. వాళ్లు ఊహించింది నిజమే. ఆమె హాలీవుడ్ నటి 'తాంజ కెల్లర్'. మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రవేశం ఉన్న తాంజ, ఎక్కువగా యూరోపియన్ సినిమాలలో .. జర్మన్ సినిమాలలో నటించింది. ఆ సినిమాలలో యాక్షన్ దృశ్యాలలో అదరగొట్టిన అనుభవం ఉంది. ఈ సినిమాలోని 'యూకా' పాత్రకి ఆమెను ఎంపిక చేయడం, బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.



More Telugu News