సచిన్ వల్లే క్రికెటర్ నయ్యా.. టీమిండియా వల్లే స్ఫూర్తి పొందా: యూఏఈ స్టార్ ప్లేయ‌ర్‌

  • సచిన్ వల్లే క్రికెటర్‌ నయ్యానన్న యూఏఈ బ్యాటర్ అలిషాన్ షరాఫు
  • 2011 ప్రపంచ కప్‌లో భారత్ గెలవడమే తనకు స్ఫూర్తి అని వెల్లడి
  • కేరళలో పుట్టి, యూఏఈలో పెరిగిన అలిషాన్ 
  • ఐఎల్‌టీ20లో రసెల్, నరైన్ వంటి దిగ్గజాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్న వైనం
  • దేశం కోసం మ్యాచ్‌లు గెలిపించే ఆటగాడిగా నిలవడమే తన లక్ష్యమ‌న్న అలిషాన్ 
  • క్రికెట్‌తో పాటు సైబర్‌ సెక్యూరిటీలో డిగ్రీ పూర్తి చేసిన అలిషాన్
యూఏఈ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా, తన క్రికెట్ ప్రయాణానికి పునాది పడింది మాత్రం భారత్‌లోనేనని ఆ జట్టు స్టార్ బ్యాటర్ అలిషాన్ షరాఫు అన్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, 2011లో భారత్ ప్రపంచ కప్ గెలిచిన అపురూప క్షణాలే తనను క్రికెటర్‌గా మార్చాయని ఆయన గుర్తుచేసుకున్నాడు. కేరళలో పుట్టి, యూఏఈలో పెరిగిన అలిషాన్, ప్రస్తుతం ఆ దేశానికి కీలక ఆటగాడిగా మారాడు.

ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ అలిషాన్ షరాఫు తన తొలి క్రికెట్ జ్ఞాపకాలను పంచుకున్నాడు. "నాకు క్రికెట్ గురించి తెలిసిన మొదటి విషయం 2011 ప్రపంచ కప్. అప్పుడు నేను భారత్‌కే మద్దతు ఇచ్చాను. ఆ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. సచిన్ టెండూల్కర్‌కు అదే చివరి ప్రపంచ కప్ కావడంతో అది నాకు మరింత ప్రత్యేకంగా నిలిచింది. సరిగ్గా అప్పుడే నేను క్రికెట్ ఆడాలని బలంగా నిర్ణయించుకున్నాను. అదే నాలో క్రికెట్ పట్ల అభిరుచిని పెంచింది" అని షరాఫు తెలిపాడు.

22 ఏళ్ల షరాఫు, 2020లో యూఏఈ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఐఎల్‌టీ20లో అబుదాబి నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న ఈ యువ కెరటం, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ వంటి దిగ్గజాల నుంచి ఎన్నో మెలకువలు నేర్చుకుంటున్నానని చెప్పాడు. "రసెల్‌ను తరచుగా సిక్సర్లు ఎలా కొడతావని అడిగాను. నరైన్ చాలా ప్రశాంతంగా, తెలివిగా ఆటను ఆడ‌గలడు. వారితో మాట్లాడటమే ఒక ప్రత్యేక అనుభూతి" అని షరాఫు వివరించాడు. ఇలాంటి దిగ్గజాలతో కలిసి ఆడటం వల్ల తన ఆత్మవిశ్వాసం రెట్టింపైందని, బ్యాటింగ్‌లో కొత్త గేర్ వచ్చిందని పేర్కొన్నాడు.

క్రికెట్‌తో పాటు చదువును కూడా సమన్వయం చేసుకుంటూ తల్లిదండ్రుల కోరిక మేరకు సైబర్‌సెక్యూరిటీలో డిగ్రీ పూర్తిచేశాడు. తన తండ్రి చేసిన త్యాగాల వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని, దేశం కోసం మ్యాచ్‌లు గెలిపించే నమ్మకమైన ఆటగాడిగా పేరు తెచ్చుకోవడమే తన లక్ష్యమని అలిషాన్ షరాఫు స్పష్టం చేశాడు.


More Telugu News