: కంటిలో ఇంకో పొర ఉందట!
మన కంటిలో పారదర్శకంగా ఉండే కార్నియా పొరతోబాటు మరో కొత్త పొరను శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భారతీయ పరిశోధకుడైన హర్మిందర్ దువా ఈ కొత్త పొరను గుర్తించారు. కంటి ముందుభాగంలో ఈ పొర ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ కొత్త పొరకు 'దువా లేయర్' అని పేరు పెట్టారు.
ఇప్పటి వరకూ కంటికి రక్షణగా నిలిచే పారదర్శక కటకమైన కార్నియాలో మొత్తం ఐదు పొరలు ఉంటాయని అనుకునేవారు. అయితే కొత్తగా గుర్తించిన ఈ దువా లేయర్ కార్నియాలోని కార్నియల్ స్ట్రోమా, డెసిమెంట్స్ మెంబ్రేన్ పొరల మధ్య ఉంటున్నట్టు గుర్తించారు. ఈ కొత్త పొర గుర్తించడం వల్ల కార్నియా మార్పిడి, కార్నియా గ్రాఫ్ట్స్ వంటి శస్త్రచికిత్సల్లో మరింత మంచి ఫలితాలను సాధించేందుకు ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ పొర 15 మైక్రాన్ల మందమే ఉన్నా కూడా ఇది ధృడంగా ఉందట. 1.5 నుండి 2 బార్ల ఒత్తిడిని కూడా ఈ పొర తట్టుకుంటుందట. ఈ విషయం గురించి ఈ పొరను గుర్తించిన దువా మాట్లాడుతూ నిజంగా ఈ పొరను గుర్తించడం గొప్ప ఆవిష్కరణ అని, దీంతో నేత్రవైద్య పాఠ్యపుస్తకాల్ని తిరగరాయాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. ఈ పొరను గుర్తించడం వల్ల కంటికి సంబంధించిన ఆపరేషన్లు మరింత తేలికగా, సురక్షితంగా చేసేందుకు వీలవుతుందని ఆయన వివరించారు. కార్నియా ముందుకు పొడుచుకు రావడం (కెరటోకోనస్) వంటి బాధితుల్లో కార్నియా ఉబ్బిపోవడానికి, ఈ దువా పొర చినిగిపోవడమే కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ పొర చినిగితే కంటిలోకి నీరు చేరి కార్నియాలోనికి చొచ్చుకుని వెళ్లి అక్కడ పోగవుతుంది, ఈ కారణంగానే కార్నియా ఉబ్బుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.