: ఈ వాచీ చాలా స్లిమ్మట!
ప్రస్తుతం మన చేతులకు రకరకాల ఆకారాల్లో అమరి మనకు సమయాన్ని తెలియజెబుతున్నాయి వాచీలు. అయితే ఈ కొత్త రకం వాచీ అసలు చేతికి ఉన్నట్టు కూడా తెలియదట. అంత స్లిమ్ముగా దీన్ని తయారుచేశారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం స్లిమ్ముపై దృష్టి పెడుతోందికదా... వాచీ కూడా స్లిమ్ముగా ఉంటే ఎలా ఉంటుంది అనుకున్నారేమో... అమెరికాలోని షికాగోకు చెందిన సెంట్రల్ స్టాండర్డ్ టైమింగ్ అనే సంస్థ వాళ్లు. వెంటనే ప్రపంచంలోనే అత్యంత సన్నటి వాచీని తయారు చేసేశారు. ఇది స్లిమ్ముగానే కాదు... చూసేందుకు కూడా అందంగానే ఉంటుందంటున్నారు.
ప్రపంచంలోనే అత్యంత సన్నటి వాచీని సెంట్రల్ స్టాండర్డ్ టైమింగ్ సంస్థ తయారు చేసింది. ఈ చేతి గడియారం మందం 0.8 మి.మీ మాత్రమే. అంటే మన క్రెడిట్ కార్డుకన్నా సన్నగా ఉంటుందన్న మాట. ఈ కొత్త రిస్ట్‌వాచీని ప్రస్తుతానికి సీఎస్‌టీ-01 అని పేరుపెట్టారు. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన ఈ వాచీకి బటన్స్ ఉండవు. టైం కూడా ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే మీద కనిపిస్తుంది. ఈ వాచీలో థినర్జీ మైక్రో ఎనర్జీ సెల్ బ్యాటరీని వాడారు. ఈ బ్యాటరీని పది నిముషాల పాటు చార్జి చేస్తే చాలు... ఒక నెలవరకూ ఇక చార్జింగ్ గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు. అంటే బ్యాటరీ అయిపోతే మార్చుకోవాల్సిన అవసరం అంతగా ఉండదు. ఈ బ్యాటరీ జీవిత కాలం కూడా 15 ఏళ్లట. ఇలాంటి సన్నటి వాచీ వెల రూ.6,300, ఇంకా దీన్ని చార్జి చేసుకోవడానికి ఉపయోగించే బేస్ స్టేషన్ కోసం మరో రెండు వేలు చెల్లించాలి. ఈ సన్నటి వాచీలు సెప్టెంబరు నుండి మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి.