నేపాల్ తొలి మహిళా సీజే నుంచి.. తొలి మహిళా ప్రధాని దాకా.. సుశీల కర్కీ ప్రస్థానం

  • అవినీతిని అస్సలు సహించని వ్యక్తిగా ప్రజల్లో సుశీలకు గుర్తింపు
  • దేశం అల్లకల్లోలంగా మారిన వేళ ఉద్యమకారులకు తొలుత గుర్తొచ్చిన పేరు సుశీల
  • వారణాసిలోని బెనారస్ హిందూ వర్సిటీలో పొలిటికల్ సైన్స్ పూర్తిచేసిన నేత
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఆ దేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన వెంటనే దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు కేబినెట్ తో కలిసి ఆమె తొలి అడుగు వేశారు. 2026 మార్చి 4న పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నేపాల్ కు తొలి మహిళా ప్రధానిగా ప్రస్తుతం సుశీల చరిత్ర సృష్టించారు. గతంలో ఆమె నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డులకెక్కారు.

దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా, అవినీతిని ఏమాత్రం సహించని వ్యక్తిగా సుశీలకు ప్రజల్లో గుర్తింపు ఉంది. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన జెన్ జెడ్ యువత ఆమెను తమ ప్రతినిధిగా, దేశ ప్రధానిగా ప్రతిపాదించింది. సుశీల తొలుత పొలిటికల్ సైన్స్ లో పట్టా పుచ్చుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి 1975లో ఆమె ఈ పట్టా అందుకున్నారు. అనంతరం స్వదేశానికి వెళ్లిపోయిన సుశీల.. అక్కడ న్యాయ శాస్త్రంలో ఉన్నత చదువులు పూర్తిచేసి న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. అంచెలంచెలుగా ఎదిగి దేశ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.

2017లో సీజే సుశీల కర్కీ.. పోలీస్ నియామకాల్లో రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించారు. దీనిపై ఆగ్రహించిన అప్పటి ప్రభుత్వం ఆమెపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టింది. అయితే, సుప్రీంకోర్టు స్టే విధించడంతో ప్రభుత్వం ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకుంది. దీంతో సుశీల సీజేగా 2022లో పదవీ విరమణ చేశారు. తాజాగా ఆమె దేశ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.


More Telugu News