నేపాల్ లో భారతీయుల బస్సుపై దాడి

  • ప్రయాణికులను దోచుకున్న దుండగులు
  • పశుపతినాథ్ ఆలయం నుంచి తిరిగి వస్తుండగా ఘటన
  • ఆర్మీ సాయంతో ప్రాణాలతో బయటపడ్డామన్న భక్తులు
నేపాల్ లోని పశుపతినాథ్ ఆలయ దర్శనానికి వెళ్లిన భారతీయులపై దాడి జరిగింది. వారు ప్రయాణిస్తున్న బస్సుపై దుండగులు దాడి చేశారు. బస్సులోని ప్రయాణికులను బెదిరించి నగదు, నగలు, సెల్ ఫోన్లు సహా విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. కాసేపటికి నేపాల్ ఆర్మీ వచ్చి తమను కాపాడిందని, భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో స్వస్థలాలకు చేరుకున్నామని భక్తులు తెలిపారు.

యూపీకి చెందిన ఈ టూరిస్టు బస్సుకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్ డ్రైవర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ దోపిడీ ఘటనను రాజ్ మీడియాకు వివరిస్తూ.. పశుపతినాథ్ ఆలయం నుంచి తిరిగి వస్తుండగా ఒక దొంగల ముఠా బస్సును అడ్డగించిందని, బస్సు అద్దాలను ధ్వంసం చేసి ప్రయాణికులను బెదిరించిందని చెప్పారు. తమ వద్ద ఉన్న నగదు, నగలు, విలువైన వస్తువుల తో పాటు బ్యాగులను కూడా ఎత్తుకెళ్లారని ఆయన వివరించారు.

దొంగలు పలువురు ప్రయాణికులపై దాడికి పాల్పడ్డారని బాధితులు తెలిపారు. ఆ తర్వాత కాసేపటికి నేపాల్ సైనికులు వచ్చి తమకు సహాయం చేశారని, భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో తాము సురక్షితంగా సరిహద్దులు దాటామని వారు పేర్కొన్నారు.


More Telugu News